‘దంగల్’ తో ఆమిర్ ఖాన్ ఎంత సంపాదించాడంటే?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ గురించి, తన సినిమాల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా ఇప్పటికే అందనంత ఎత్తుకు ఎదిగిపోయిన ఆమిర్ ఖాన్.. ఇప్పుడు తన సినిమాలతోనే సంపాదన విషయంలో కూడా ఎవరికీ సాధ్యం కాదన్నట్లు రికార్డులు సృష్టిస్తుండటం విశేషం. ఇక ఈ మధ్య ఆమిర్ ఖాన్ నటించిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసి.. ఆమిర్ పట్టిందల్లా బంగారమే అనే రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ముందుగా ఆమిర్ నటించిన ‘పీకే’ సినిమా భారతీయ సినిమా పరిశ్రమలోనే రికార్డు స్థాయిలో రూ. 792 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసే ఉంటుంది. అలాగే రీసెంట్ గా వచ్చిన ఆమిర్ ఖాన్ ‘దంగల్’ సినిమా అయితే దాదాపుగా రూ. 532 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందట. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమిర్ ఖాన్ రెమ్యునరేషన్ తో కూడిన సంపాదన లెక్కలు షాకింగ్ గా మారాయి.

ఈ మేరకు తాజాగా ‘దంగల్’ తో ఆమిర్ ఖాన్ ఎంత సంపాదించాడో చెబుతూ కొన్ని లెక్కలు బయటకొచ్చాయి. ఆ స్టోరీలోకి వెళితే, ‘దంగల్’ సినిమాను డిస్నీ, యూటీవీతో కలిసి ఆమిర్ ఖాన్ స్వయంగా నిర్మించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి గాను ఆమిర్ ఖాన్ సంపాదించిన ఆదాయం దాదాపు రూ. 175 కోట్లు అని సమాచారం. ఈ క్రమంలో డిస్నీ యూటీవీతో కలిసి ఆదాయాన్ని పంచుకున్నా సరే తన మట్టుకే 175 కోట్ల రూపాయలను ఆమిర్ వెనకేసుకున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఓ సినిమాలో నటించే ముందు ఆమిర్ ఖాన్ 35 కోట్ల రూపాయలు తీసుకోవడమే కాకుండా ప్రతీ చిత్రానికి పార్టనర్ షిప్ కింద ఆదాయంలో 33 శాతం వాటాను తీసుకుంటున్నారట. ఇక ఇప్పటినుంచైతే, రాయల్టీ కింద శాటిలైట్ రైట్స్ తో కలిపి సినిమా వసూళ్ళలో 33 శాతం వాటా తీసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారట. అందుకే మరి ఇప్పుడు నటనలోనే కాదు సంపాదనలో కూడా ఆమిర్ ఖాన్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంటూ బాలీవుడ్ జనాలు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.