ముక్కుపుడకతో షాక్ ఇచ్చిన స్టార్ హీరో..!

 

బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఎంత గొప్ప నటుడో, ఎలాంటి వైవిధ్యమైన సినిమాలు చేస్తాడో ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా సినిమా సినిమాకు తన స్థాయిని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్న ఆమిర్.. పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా వెనుకాడకుండా ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే.. ఆమిర్ ఖాన్ తన కొత్త సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ కు కూడా ప్రయోగాలకు సిద్ధమైపోతున్నాడు కాబట్టి. అంటే ఇప్పటికే పీకే లో న్యూడ్ గా కనిపించి, దంగల్ లో విపరీతంగా బాడీలో మార్పులు చూపించి షాక్ ఇచ్చిన ఆమిర్.. ఇప్పుడు సెట్స్ పై ఉన్న థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ పేరు చెప్పి స్వీట్ షాక్ ఇస్తున్నాడు.
అసలు విషయంలోకి వెళితే, ఇప్పటివరకు పాత్రల పేరు చెప్పి ఎన్నో వేషాలు వేసిన ఆమిర్ ఖాన్ ఇప్పుడు ఏకంగా ముక్కుపుడకతో దర్శనమిచ్చి ఇంట్రెస్టింగ్ మేటర్ కు తెర తీశాడు. ఈరోజుల్లో ముక్కుపుడక పెట్టుకోవడానికి అమ్మాయిలే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని నేపథ్యంలో.. ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఆ పనిచేయడంతో బీటౌన్ మీడియా విపరీతంగా ఎక్సయిట్ అయిపోతుంది. అందులోనూ ఓ సినిమా కోసం ఆమిర్ ఈ పనిచేయడంతో.. ఆశ్చర్యంగా ఉందంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
దీంతో ఇప్పుడు ముక్కుపుడక పెట్టుకున్న ఆమిర్ ఖాన్ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ మూవీలో తొలిసారిగా ఆమిర్ ఖాన్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో.. సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా బాహుబలి-2 కలెక్షన్స్ రికార్డులను బద్దలు కొట్టే సత్తా ఈ సినిమాకు ఉందని అంటున్నారు. మరోవైపు, ఈ సినిమాలో దంగల్ ఫేమ్ ఫాతిమా సనా ఖాన్ తో పాటు కత్రినా కైఫ్ కూడా హీరోయిన్ గా నటిస్తుండటంతో.. ఇది క్రేజీ ప్రాజెక్టుగా మారిపోయింది. ఇక ఇప్పుడేమో ఆమిర్ ఖాన్ ముక్కుపుడక పెట్టుకుని కనిపించడంతో.. సినిమాకు అప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో లభిస్తోంది.