వావ్.. కాటమరాయుడు వెనుక అజిత్ ఫ్యాన్స్! 

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు చాలా విషయాల్లో దగ్గర పోలికలు ఉన్నాయనే టాక్ ఎప్పటినుంచో నడుస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలోనూ, మాస్ స్టార్ డమ్ విషయంలోనూ వీరిద్దరూ ఎవరికి వారే సాటి అనే రేంజ్ లో ఉంటారు. తెలుగులో తనకంటూ తిరుగులేని క్రేజ్ తో సినిమాలకు అతీతంగా ఓ బలమైన శక్తిగా పవన్ ఉంటే.. అటు తమిళంలో కూడా సేమ్ అలాంటి క్రేజ్ తోనే అజిత్ కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.

ఇప్పుడు ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే.. అజిత్ హీరోగా నటించిన ‘వీరమ్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన పవన్ ‘కాటమరాయుడు’ సినిమా ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయింది కాబట్టి. దీనికే ఏముందిలే అనుకుంటున్నారా.. ఇక్కడే అసలైన విషయం దాగుంది. అదేంటంటే.. ప్రస్తుతం ‘కాటమరాయుడు’ హంగామా కేవలం మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా పాకేసింది. ప్రధానంగా తమిళనాట కాటమరాయుడు అవతారంలో ఉన్న పవన్ ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున కనిపిస్తుండటం విశేషం. అందులోనూ ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది అజిత్ ఫ్యాన్స్ కావడమే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది.
దీనికి కారణం మన పవన్ పై వాళ్ళ అభిమానంతో పాటు కాటమరాయుడు సినిమా అజిత్ వీరమ్ సినిమాకు రీమేక్ కావడం కూడా. దీంతో తమిళనాట అజిత్ ఫ్యాన్స్ పవన్ ను మరింతగా ఓన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే టెంపుల్ సిటీ మధురైకి చెందిన అజిత్ ఫ్యాన్స్ అక్కడ పవన్ – అజిత్ లతో కూడిన కాటమరాయుడు ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి పవన్ సినిమాకు గ్రాండ్ గా వెల్కమ్ చెబుతున్నారు. అలాగే ఆటోల వెనకాల కూడా పవన్ కాటమరాయుడు పోస్టర్లను అతికించి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నారు. దీంతో తమిళనాట ఈ హడావుడిని ఆన్ లైన్ లో చూసి మన తెలుగునాట పవన్ ఫ్యాన్స్ మరింత ఖుషీ అయిపోతున్నారు. అంతేకాకుండా అజిత్ సినిమా ఈసారి తెలుగులో రిలీజ్ అయితే ఈ రేంజ్ లోనే ఆయనకు ఇక్కడ వెల్కమ్ చెప్పాలని అనుకుంటున్నారట. మొత్తానికి ఇది ఫ్యాన్స్ కు ఓ సరికొత్త పండుగ లానే అయిపోయింది.