స్టార్ హీరోయిన్ పై రైటర్ సంచలన ఆరోపణ

Apurva Asrani Slams Kangana Ranaut

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకుంది. ఎప్పుడూ ఓపెన్ గా మాట్లాడి తనే వివాదాలు సృష్టించే కంగనా.. ఇప్పుడు ఓ రైటర్ కారణంగా వివాదంలో చిక్కుకోవడం విశేషం. ఆ స్టోరీలోకి వెళితే, కంగనా రనౌత్ కొత్త సినిమా ‘సిమ్రాన్’ టీజర్ రీసెంట్ గా రిలీజై ఆకట్టుకున్న విషయం తెలిసే ఉంటుంది. ఈ టీజర్ చూసి.. సిమ్రాన్ కూడా కంగనాకు క్వీన్ లాంటి ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పుడు ఈ సిమ్రాన్ సినిమా టైటిల్స్ లో అడిషినల్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ క్రెడిట్ కంగనాకు ఇవ్వడంపై స్టార్ రైటర్ అపూర్వ అస్రాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు సంచలన ఆరోపణలు చేశాడు. ముందుగా సిమ్రాన్ స్క్రిప్ట్ రాసింది తానైతే, తన పేరు కంటే ముందు కంగనా పేరును ఎలా వేస్తారంటూ అపూర్వ ప్రశ్నిస్తూ ఫేస్ బుక్ లో ఓ సుదీర్ఘమైన మేటర్ ను పోస్ట్ చేశాడు.

అందులో సిమ్రాన్ సినిమా కోసం తాను తొమ్మిది డ్రాఫ్ట్స్ రాశానని, చివరకు ఫైనల్ వెర్షన్ రెడీ చేసి కంగనాకు స్క్రిప్ట్ వినిపిస్తే.. ఆమె యెగిరి గంతేసినంత పని చేసిందని అపూర్వ అస్రాని పేర్కొన్నాడు. అలాగే సిమ్రాన్ సినిమా షూటింగ్ సమయంలో ఆన్ సెట్స్ లో బెటర్మెంట్ పేరు చెప్పి కొన్ని మార్పులు చేర్పులు జరిగిన మాట వాస్తవమేనని.. అది తెలిసి తాను కూడా సంతోషించానని, కానీ ఆ మాత్రానికే క్రెడిట్ కంగనాకు ఇవ్వడం, తన పేరు కంటే ముందు ఆమె పేరు వేయడం ఏమిటని రైటర్ అపూర్వ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా దర్శకుడు హన్సల్ మెహతాతో కలిసి తానే స్క్రిప్ట్ రాసినట్లుగా కంగనా చెప్పుకుంటుందని, అది తన కష్టాన్ని దోచుకోవడమేనని అపూర్వ ఆరోపణలు చేశాడు. చివరగా ఈ మోసాన్ని కొన్నాళ్ల నుంచి భరిస్తూ వచ్చానని, ఇక ఆగలేక ఇలా ఓపెన్ అవుతున్నానని ఫేస్ బుక్ పోస్ట్ లో వెల్లడించాడు. మరి ఈ రైటర్ ఆరోపణలపై టాలెంటెడ్ కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి.