‘బాహుబలి-2’ కూడా బ్రహ్మోత్సవం లానే..!!

టాలీవుడ్ కీర్తిని మరోసారి దశ దిశలా వ్యాపింపజేయడానికి ‘బాహుబలి-2’ ఇంకొన్ని రోజుల్లోనే థియేటర్స్ లోకి వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ఇలాంటి టైమ్ లో ఓ ప్రతిపాదన మళ్ళీ కొత్తగా తెరపైకి రావడం విశేషం. ఆ స్టోరీలోకి వెళ్లేముందు, సినిమా థియేటర్లలో రోజుకు నాలుగు షో లకు మించి ప్రదర్శించకూడదనే నిబంధన ఉన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలి. ఇదే సమయంలో షో ల సంఖ్యను ఐదుకు పెంచాలనే ప్రతిపాదన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పట్నుంచో ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఓసారి ఆమోదించిందనే విషయం తెలిసే ఉంటుంది. అయితే, అది పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. ఇంతకూ మేటర్ ఏంటంటే, గతేడాది మహేష్ ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు నిర్మాత పీవీపీ.. తెలంగాణ అధికారులతో మాట్లాడి, తొలి రోజు వరకు ఐదు షో లు నడిపించేందుకు అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే, మార్నింగ్ షో కే ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు భారీ డిజాస్టర్ టాక్ వచ్చేయడంతో.. అక్కడి నుంచి సినిమా వైపు ఎవరూ చూడకపోవడంతో.. దీనివల్ల పెద్దగా లాభం ఉండదని భావించి, ఆ తర్వాత ఎవరూ కూడా ఐదు షో ల సౌలభ్యాన్ని కోరుకోలేదు. కానీ, ఇప్పుడు అందరికీ స్వీట్ షాక్ ఇస్తూ.. ‘బాహుబలి ది కంక్లూజన్’ కు ఐదో షో ను వాడుకునే ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. దీనికోసం ఇప్పటికే నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్మిషన్ల కోసం ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఇక దీనికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. పెద్ద పండుగే అవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ‘బాహుబలి-2’ మీద భారీ పెట్టుబడి పెట్టిన బయ్యర్లకు కాస్త ఊరటగా ఉంటుంది. అందులోనూ సినిమాపై ఉన్న క్రేజ్ ఆకాశాన్ని తాకడంతో.. ఇప్పుడు ఐదు షో లు నడిపినా ఎటువంటి ఇబ్బంది ఉండదని చెబుతుండటం గమనార్హం. మరి అనుకున్నట్లే, ఐదో షో పడితే అప్పుడు కలెక్షన్స్ ఏ రేంజ్ లో పెరుగుతాయో చూడాలి.