వీరాభిమాని మృతి.. విషాదంలో బాలయ్య

nandamuri fans association president death

నటసింహం నందమూరి బాలకృష్ణ తన అభిమానులతో ఎంత సన్నిహితంగా మెలుగుతారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాసిం (53) గత అర్థరాత్రి గుండెపోటుతో మృతి చెందితే బాలయ్య తీవ్ర విషాదంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. నంద్యాలలోని నూనెపల్లె వీధికి చెందిన ఖాసిం గతంలో ఎన్టీఆర్ హయాం నుంచే నందమూరి కుటుంబానికి  సన్నిహితుడిగా మెలిగినట్లు సమాచారం. ముఖ్యంగా బాలకృష్ణకు వీరాభిమానిగా ఉంటూ.. బాలయ్య ప్రతీ పుట్టిన రోజుకీ, ప్రతీ సినిమా రిలీజ్ కూ సేవా కార్యక్రమాలను చేపడుతూ తన అభిమానాన్ని చాటుకోవడంలో ఖాసిం ఎప్పుడూ ముందుంటారట. ఈ నేపథ్యంలో ఆయన బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా సేవలు అందించడం జరిగింది.

అంతేకాకుండా ఖాసిం 75 సార్లు రక్తదానం కూడా చేసి రికార్డు సృష్టించారట. ఇలా అనేక గొప్ప కార్యక్రమాలతో ఎంతో పేరు తెచ్చుకున్న ఖాసిం ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ తదితరుల చేతుల మీదుగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారని తెలుస్తోంది. అలాంటి ఖాసిం గత రాత్రి ఉన్నట్టుండి గుండెపోటుకు గురికావడంతో.. కుటుంబ సభ్యులు స్థానిక హాస్పిటల్ కు తరలించారని, అనంతరం అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించారని సమాచారం. దీంతో ఈ విషయం తెలుసుకున్న బాలయ్య తాజాగా తీవ్ర మనస్తాపానికి గురయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి అధికారికంగా బాలయ్య నుంచి ఇంకా ఎటువంటి స్పందనా బయటకు రాలేదని అంటున్నారు. ప్రస్తుతం మాత్రం పలువురు టీడీపీ నాయకులు, నందమూరి అభిమానులు, పట్టణంలోని థియేటర్ల యజమానులు విషయం తెలుసుకుని తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. ఖాసిం మృతదేహానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.