జబర్దస్త్, పటాస్ షో లపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Censor Member files complaint Jabardasth, Pataas shows

తెలుగు బుల్లితెరపై ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న జబర్దస్త్, పటాస్ వంటి కార్యక్రమాలు ఏ రేంజ్ లో దుమ్మురేపుతున్నాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా నాగబాబు, రోజా లాంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా ఉన్న జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. అయితే, ఇదే టైమ్ లో ఈ షో లో అశ్లీలత,అసభ్యత ఎక్కువైందనే విమర్శలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి జబర్దస్త్, పటాస్ కార్యక్రమాలపై బాలానగర్ పోలీస్ స్టేషన్ లో సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది. ఈ సందర్బంగా ఆయన తన ఫిర్యాదులో.. జబర్దస్త్ కార్యక్రమంలోని కొన్ని ఎపిసోడ్స్ లో అనైతిక దృశ్యాలు, అసంబద్ధ పదాలు వాడుతూ అశ్లీలంగా ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ విషయాలపై టీవీ యాజమాన్యం గాని, ప్రోగ్రామ్ డైరెక్టర్ గాని సెన్సార్ చేయడం లేదని, అందుకే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నందనం దివాకర్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇకపోతే, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం సదరు సెన్సార్ బోర్డు సభ్యుడు మీడియాతో మాట్లాడుతూ.. జబర్దస్త్ షో లో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నటుడు నాగబాబు, ఎమ్మెల్యే రోజా పై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే ఎమ్మెల్యే రోజాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన హోదాలో ఉన్న రోజా ఇలా ఓ ఛానల్ లో మహిళలను కించపరిచే విధంగా ప్రసారమవుతున్న కార్యక్రమంలో పాల్గొనడం సరికాదని, ఇలా కుటుంబ సమేతంగా చూడాల్సిన కార్యక్రమాలను చూపించకుండా చెత్త విషయాలను చూపించి యువతను పెడదారి పట్టిస్తున్నారని అన్నారు. మరి ఈయన ఆవేదన ఆయా షో లను ఎంతవరకు కదిలిస్తుందో చూడాలి.