మెగా క్రేజ్.. మరాఠీ పేపర్లో చిరు ఖైదీ యాడ్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని చాలా ఏళ్ళ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై సోలో హీరోగా చూసే టైమ్ దగ్గరకొచ్చేసిన విషయం తెలిసిందే. ఇంకొన్ని గంటల్లోనే చిరు రీఎంట్రీ ఇస్తూ చేస్తోన్న ప్రతిష్టాత్మక 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఇప్పుడు అభిమానుల ఉత్సాహం ఏ రేంజ్ లో ఉందో మాటల్లో చెప్పడం కష్టమవుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ మెగా సినిమా జోరు హోరెత్తిపోతోంది. ఇదే టైమ్ లో ఈ ఖైదీ దేశమంతా కూడా తన జోరు చూపిస్తుండటం గురించి ఇప్పుడు స్పెషల్ గా చెప్పుకుని తీరాలి.
ఆ స్టోరీలోకి వెళితే, తెలుగు సినిమాలకు కర్ణాటకలో కూడా మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు పెద్దగా ప్రచారం లేకుండానే అక్కడ మంచి ఓపెనింగ్స్ లభిస్తూ ఉంటాయి. కానీ, ‘ఖైదీ నంబర్ 150’ కోసం ఏకంగా అక్కడి పేపర్లలో ప్రకటనలు కూడా ఇచ్చేస్తున్నారట. అందులోనూ ఓ తెలుగు సినిమాను నేరుగా రిలీజ్ చేస్తూ, మరాఠీ పేపర్లో యాడ్ కూడా వేయడం ఇప్పుడు అరుదైన విషయంగా చెప్పుకుంటున్నారు. ఈ విధంగా అక్కడి లోకల్ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు ఖైదీ సినిమాను ప్రమోట్ చేస్తుండటం మెగా క్రేజ్ కు అద్దం పడుతుందని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇకపోతే, మహారాష్ట్రలో మాత్రమే కాకుండా.. చాలా రాష్ట్రాల్లో మెగా సినిమాపై బజ్ ఇలానే ఉందని తెలుస్తోంది. అందులో భాగంగా అహ్మదాబాద్ లో కూడా అర్థరాత్రి నుంచి బెనిఫిట్ షో లు వేసి ఫ్యాన్స్ హంగామా చేయడానికి రెడీ అవుతున్నారట. దీంతో ఇప్పుడు మొత్తంగా దేశం మొత్తం కలుపుకుని ఖైదీ తొలిరోజు కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయోనని ఫ్యాన్స్ ఇప్పటినుంచే లెక్కలు వేసేసుకుంటున్నారు.