ఆ న్యూడ్ సీన్ తప్ప మిగతావన్నీ చేస్తానంటున్న చిరంజీవి  

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంకొన్ని గంటల్లోనే ‘ఖైదీ నెంబర్ 150’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ తన ప్రతిష్టాత్మక 150వ చిత్రం ప్రమోషన్స్ తో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చిన చిరంజీవి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అందులో భాగంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ పై మెగాస్టార్ ప్రశంసల వర్షం కురిపించారు. ముందుగా తెలుగులో ఛాన్స్ వస్తే చిరంజీవితో కలిసి నటించాలని ఉందంటూ ఆమిర్ ఖాన్ ఇటీవల తన ‘దంగల్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ విషయంపైనే మాట్లాడిన చిరంజీవి.. ఆమిర్ ఖాన్ లాంటి గొప్ప నటుడు అలా వ్యాఖ్యానించడం తనకెంతో సంతోషం కలిగించిందని, ఇద్దరికీ తగిన పాత్రలు ఉండి నిజంగా మూవీ కుదిరితే బాగుంటుందని అన్నారు. ఈ సందర్బంగా ఆమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ లాంటి సినిమాలు మీ నుంచి ఆశించవచ్చా అని అడిగినప్పుడు చిరంజీవి ఆసక్తికరంగా స్పందించారు. ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం ఇస్తూ.. పీకే లాంటి సినిమాలు ఆమిర్ ఖాన్ మాత్రమే చేయగలడని, ఆయనో విలక్షణ నటుడని, ఆయన ఏదైనా చేయగలడు, రాణించగలడు అని..  నాకు అంత టాలెంట్ ఉందని నేను అనుకోవడం లేదని, నాకంటూ కొన్ని పరిమితులు ఉన్నాయని, ఆ పరిమితుల్లో ఏదైనా చేయగలనని చిరంజీవి చెప్పుకొచ్చారు. చివరగా పీకే లాంటి సినిమాలో అవకాశమిస్తే.. మొదటి సీన్ తప్ప మిగతాది చేయగలనని అంటూ చిరంజీవి నవ్వేస్తూ నవ్వులు పూయించారు. ఇదిలా ఉంటే, పీకే లో ఆమిర్ ఖాన్ గ్రహాంతర వాసిగా టేప్ రికార్డర్ పట్టుకుని న్యూడ్ గా కనిపించిన తొలి సన్నివేశం అంత సులువుగా మర్చిపోలేం. దాని గురించే చిరు మాట్లాడుతూ.. ఆ న్యూడ్ సీన్ తప్ప మిగతావన్నీ చేస్తానని అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.