వ‌ర్మ నాగ‌బాబు ట్వీట్ల యుద్ధంపై చిరు స్పంద‌న ఇదీ…

 
ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో నాగ‌బాబు వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్నే లేపాయి. నాగ‌బాబు స్పీచ్ ముగిసిందో, లేదో.. వ‌ర్మ ట్వీట్ల వ‌ర్షం కురిపించాడు. దాంతో నెటింజ‌న్ల‌కు బోల్డంత కాల‌క్షేపం దొరికింది. మ‌రింత‌కీ వీరిద్ద‌రి ట్వీట్ల యుద్ధంపై చిరంజీవి స్పంద‌నేంటి??  చిరు ఏమ‌నుకొంటున్నాడు??  సోమ‌వారం హైద‌రాబాద్‌లో చిరు పాత్రికేయుల‌తో ముచ్చ‌టిస్తున్నప్పుడు ఈ ప్ర‌శ్న త‌లెత్తింది. వ‌ర్మ ట్వీట్ల గురించి చిరు కూడా స్పందించాల్సివ‌చ్చింది. వ‌ర్మ అంటే త‌న‌కు అభిమాన‌మ‌ని, వ‌ర్మ కూడా త‌న‌ని అభిమానిస్తుంటాడ‌ని, అయితే ఇలాంటి ట్వీట్లు ఎందుకు చేస్తాడో అర్థం కాద‌ని చెప్పుకొచ్చాడు చిరు. నాగ‌బాబు కామెంట్ల‌పై స్పందిస్తూ..”నాగ‌బాబు హ‌ర్ట‌య్యాడు. అందుకే అలా స్పందించాల్సివ‌చ్చింది. అయితే ఈ వేదిక స‌రైన‌దా, కాదా.. ఇక్క‌డ స్పందించాలా, వ‌ద్దా అనేది ఆలోచించ‌లేదు. ఒకొక్క‌రిదీ ఒక్కో తత్వం. నాగ‌బాబు త‌త్వం అలానే ఉంటుంది” అని త‌మ్ముడిని వెన‌కేసుకొచ్చాడు చిరు.
 
వ‌ర్మ కామెంట్ల‌పై మీరెప్పుడూ ఎందుకు స్పందించ‌లేదు?  అని అడిగితే… ”కొన్ని చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేయాలి. వాటి గురించి మాట్లాడ‌డం అన‌వ‌స‌రం. నేనెప్పుడూ పాజిటీవ్ మైండ్‌తో ఆలోచిస్తా. నా అభిమానులూ వ‌ర్మ కామెంట్ల‌ని అలానే రిసీవ్ చేసుకొంటార‌ని నా న‌మ్మ‌కం” అంటూ వ‌ర్మ సెటైర్ల‌ని లైట్‌గా తీసుకొన్నాడు చిరు. సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధాన్నీ ప్ర‌స్తావించాడు. ”అభిమానులంతా సినిమాని అభిమానించాలి. మూర్ఘత్వానికి పోయి మ‌రో హీరోని దూషించ‌డం త‌గ‌దు. నేనైతే అంద‌రు హీరోల‌తోనూ బాగానే ఉంటా. అంద‌రూ నాతో బాగుంటారు. మామ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంది. ఫ్యాన్స్ మ‌ధ్య కూడా అది ఉండాలి” అని చెప్పుకొచ్చాడు చిరు.