షాకింగ్ :  చిరు బ‌డ్జెట్ రూ.100 కోట్లు

ఈ సంక్రాంతికి ఖైదీ నెం.150గా అల‌రించాడు చిరంజీవి. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించి.. చిరు రీ ఎంట్రీకి ఘ‌న‌మైన స్వాగ‌తం అందించింది. ఇప్పుడు అంద‌రి దృష్టీ చిరు 151పైనే.  భార‌త తొలి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌ని సినిమాగా తీయాల‌ని చిరు ఎప్ప‌టి నుంచో భావిస్తున్నాడు. ఇప్పుడు అందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ స్క్రిప్టుని చిరంజీవి.. సురేంద‌ర్ రెడ్డి చేతిలో పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో యుద్ధ స‌న్నివేశాల‌కు, విజువ‌ల్ ఎఫెక్ట్స్ ల‌కు భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌కి చోటుంద‌ట‌. అందుకే. వాటిని వీలైనంత వ‌ర‌కూ గ్రాండియ‌ర్‌గా తీయాల‌ని చిరు భావిస్తున్నాడు. ఖైదీ నెం.150కి ద‌క్కిన వ‌సూళ్లు, బాక్సాఫీసు క‌ల‌క్ష‌న్లు, చిరు మార్కెట్ ఇవ‌న్నీ లెక్క‌లు వేసుకొని త‌న త‌దుప‌రి సినిమాకి దాదాపు రూ.100 కోట్ల‌యినా ఖ‌ర్చు పెట్టొచ్చ‌ని చిరు ఫిక్స‌య్యాడ‌ట‌. బాహుబ‌లి వ‌చ్చిన త‌ర‌వాత ప్ర‌తీ సినిమా అదే స్థాయిలో, అంతే గ్రాండియ‌ర్‌గా ఉండాల‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. ఎంత ఖ‌ర్చు పెట్టినా తిరిగి రాబ‌ట్టుకొనే స‌త్తా సినిమాల‌కు ఉంద‌న్న న‌మ్మ‌కం ఇప్పుడిప్పుడే క‌లుగుతోంది. అందుకే.. చిరు త‌దుప‌రి సినిమాకి రూ.100 కోట్లు పెట్టినా త‌ప్పులేద‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ఎలాగూ  ఈసినిమాకి చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు కాబ‌ట్టి, బ‌డ్జెట్ విష‌యంలో ఎలాంటి ష‌ర‌తులూ విధించ‌క‌పోవొచ్చు. ఈ చిత్రానికి పేరు గాంచిన బాలీవుడ్‌, హాలీవుడ్ నిపుణ‌లు ప‌నిచేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏప్రిల్ లో చిరు 151 సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. ఈలోగా ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డికి సంబంధించిన మ‌రిన్ని విష‌యాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.