విషాదంలో దిల్ రాజు కొత్త స్టోరీ

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు సినిమాలంటే ఎంత ఫ్యాషనో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి దిల్ రాజు, భార్య మరణానంతరం విషాదంలో మునిగిపోయి గత కొన్నిరోజులుగా సినిమా వ్యవహారాలకు దూరంగా ఉండిపోవడం బాధాకరం.

అయితే, అటువంటి విషాద సమయంలో కూడా తాను అనుభవించిన వేదన నుంచి ఓ స్టోరీ ఐడియా పుట్టిందని తాజాగా దిల్ రాజు చెప్పుకురావడం గమనార్హం. ఆ విషయంలోకి వెళితే, తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ.. నా భార్య చనిపోయాక నేను పదమూడు రోజులు ఇంటి నుంచి బయటకు వెళ్లలేదని, ఆ సమయంలో ‘ఇదే ఇదే జీవితం.. సుఖః దుఃఖాల సంగమం’ పాట వింటూ గడిపానని చెప్పుకొచ్చారు.

అనంతరం ఆ పాట విన్నప్పుడే రచయితలు వూరికే రాయరని అనిపించిందని, జీవిత అనుభవాలనే పాటలుగా రాస్తారని అర్థమైందని, ఆ థాట్ ప్రాసెస్ లో నాకొక స్టోరీ లైన్ కూడా తట్టిందని, ఆ స్టోరీతో సినిమా తీయాలనుకుంటున్నానని దిల్ రాజు చెప్పడం విశేషం.

ఇదే సమయంలో గత ఐదు నెలల కాలం తన జీవితంలో చిత్రమైన అనుభవాలను, మిశ్రమానుభూతులను మిగిల్చిందని దిల్ రాజు వివరిస్తూ.. ‘జీవితం చాలా విచిత్రమైందని.. గడిచిన ఐదు నెలల్లో ‘శతమానం భవతి’ ఒక సంతోషం, నాకు మనవడు పుట్టడం ఒక సంతోషం, ‘నేను లోకల్’ ఒక సంతోషం.. ఇలా జీవితం అద్భుతంగా ముందుకు సాగుతోంది అనుకున్నప్పుడు దేవుడు అనుకోని జర్క్ ఇచ్చాడని.. ఆ బాధలో ఉండగానే ‘శతమానం భవతి’ కి నేషనల్ అవార్డు.. దానితో పాటు నాకు చక్రపాణి – నాగిరెడ్డి అవార్డు దక్కాయని.. ఇలా ఐదు నెలల్లో దేవుడు నాకు అటూ ఇటూ కూడా చూపించాడు’ అని పేర్కొన్నారు.

ఏదిఏమైనా, ఇలా విషాదంలోనూ దిల్ రాజుకు ఒక కొత్త స్టోరీ ఐడియా రావడం, దానిని సినిమాగా మలచాలని అనుకోవడం చూస్తుంటే.. సినీరంగంలో ఉన్నవాళ్లకు సినిమా తప్ప మరొక ఆలోచన ఉండదని అర్థమవుతుంది.

Follow US