సునీల్ ను కొట్టిన స్టార్ కమెడియన్

బాలీవుడ్ బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా చెలామణి అవుతూ తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకున్న కపిల్ శర్మ తాజాగా ఊహించని విధంగా అందరికీ షాక్ ఇచ్చాడు. ఏకంగా మందు కొట్టి తన సహ నటుడిపై దాడి చేసి హాట్ టాపిక్ కు తెర తీశాడు. ఆ స్టోరీలోకి వెళితే, తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్, సిడ్నీ లలో పలు షో లు చేసిన కపిల్ శర్మ తన తిరుగు ప్రయాణాన్ని ఎయిర్ ఇండియా విమానంలో చేశాడట. ఈ సందర్బంగా విమానంలో తన సీటులో పొరపాటున కూర్చున్న తన సహ నటుడు సునీల్ గ్రోవర్ మీద కపిల్ శర్మ చేయి చేసుకున్నాడని సమాచారం.

ముందుగా తాగిన మైకంలో నువ్వు నా పనోడివి అంటూ తిట్ల దండకాన్ని అందుకున్న కపిల్.. తర్వాత సునీల్ గ్రోవర్ ను ఇష్టమొచ్చినట్లు కొట్టినట్లు తెలుస్తోంది. అయితే, కపిల్ శర్మ అంతలా దాడి చేస్తున్నా కూడా సునీల్ గ్రోవర్ కామ్ గా ఉన్నాడే తప్ప ఏ విధంగానూ స్పందించలేదట. దీంతో మద్యం మత్తులో నానా రభస చేస్తోన్న కపిల్ శర్మను టీమ్ లోని ఇతర సభ్యులు వచ్చి సముదాయించి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, కపిల్ శర్మ చేసిన రచ్చపై ఎయిర్ ఇండియా అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం.

మరోవైపు, ఈ ఘటన నేపథ్యంలో గతంలో కపిల్ శర్మ – సునీల్ గ్రోవర్ ల మధ్య నెలకొన్న విభేదాలను బీటౌన్ ఇప్పుడు మళ్ళీ తెరపైకి తెస్తోంది. ముఖ్యంగా కపిల్ శర్మ షో లో పనిచేసిన సునీల్ ఒకప్పుడు కపిల్ తనకు సరిగ్గా రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని అంటూ బయటకొచ్చి తనకు తాను సొంతంగా స్టార్ ప్లస్ లో షో చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా అప్పుడు ఆ షో అంతగా వర్కౌట్ కాకపోవడంతో.. సునీల్ తిరిగి కపిల్ షో లో చేరాడని, అందుకే తాగిన మైకంలో సునీల్ తో కపిల్ అలా ప్రవర్తించాడని అంటున్నారు. ఈ సందర్బంగా ఈ దాడి నిజంగానే జరిగిందనేలా.. ఈ ఇద్దరు నటులు ట్విట్టర్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారని తెలుస్తోంది. మరి ఇప్పుడు ఈ గొడవ ఎక్కడి వరకు వెళుతుందో.. కపిల్ యాక్షన్ కు సునీల్ ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి.