అక్కినేని యువ హీరోల్లో ఇగో ప్రాబ్లెమ్స్.. నిజమేనా?

టాలీవుడ్ వెబ్ మీడియా సర్కిల్ లో ప్రస్తుతం ఓ షాకింగ్ న్యూస్ హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. అందులో ఎంత నిజముందో తెలియదు గాని.. టాలీవుడ్ బడా ఫ్యామిలీలలో ఒకటిగా వెలుగొందుతున్న అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఆ న్యూస్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అసలు విషయంలోకి వెళితే, ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసులుగా నాగచైతన్య, అఖిల్, సుశాంత్, సుమంత్ తదితరులు హీరోలుగా కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు వీళ్ళ మధ్య ఓ ఫ్యామిలీలా మంచి అనుబంధం ఉండగా.. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో సుశాంత్ కొంచెం దూరం అవుతున్నాడని కొన్ని వెబ్ మీడియా సైట్స్ లో కథనాలు వెలువడటం షాకింగ్ గా మారింది.

అంతేకాకుండా కెరీర్ లో ఒక్కటీ సరైన హిట్ లేకపోవడం.. ఇటు చైతూ, అఖిల్ లు స్టార్ డమ్ తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తుండటంతో సుశాంత్ కాస్త ఫీల్ అవుతున్నట్లు చెప్పేస్తున్నారు. ఇక ఇదంతా సుశాంత్ ఇటీవల హీరోగా నటించిన ‘ఆటాడుకుందాం రా’ సినిమా సమయంలో బయటపడినట్లు చెబుతుండటం హాట్ న్యూస్ అయింది. ప్రధానంగా కజిన్ అయిన సుశాంత్ మీద అభిమానంతో అఖిల్, చైతూ లు ‘ఆటాడుకుందాం రా’ సినిమాలో గెస్ట్ రోల్స్ లో నటించడం ఇగో ప్రాబ్లెమ్స్ కు దారితీసిందని అంటున్నారు. ఇంతకూ మేటర్ ఏంటంటే.. సుశాంత్ సినిమా నిర్మాత.. అఖిల్, చైతూ ల క్రేజ్ ను సినిమా కోసం వాడుకునే ప్రయత్నంలో భాగంగా ఆ ఇద్దరు మధ్యలో సుశాంత్ ఉన్న పోస్టర్స్ ను రిలీజ్ చేసి ఆ దిశగా పబ్లిసిటీ బాగా చేయించారట.
దీంతో ఆ టైమ్ లో సదరు నిర్మాతపై సుశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడట. అంతేకాకుండా ఆ పోస్టర్లు ఎలా వేస్తారు? అని, నా సినిమాలో వాళ్ళు చేశారా? లేక వాళ్ళ సినిమాలో నేను చేశానా? అంటూ సదరు నిర్మాతను నిలదీసినట్లు సమాచారం. ఈ కారణంగా హర్ట్ అయిన ఆ నిర్మాత ఇప్పటివరకు సుశాంత్ తో వరుసగా సినిమాలు చేసినా.. ఇప్పుడు మాత్రం తన కొత్త సినిమాను చైతూతో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు సుశాంత్ వరకు వెళ్లడంతో.. ఆ నిర్మాతతో తమకు ఉన్న వేరే వ్యాపారాల లెక్కలు చెప్పమని, తప్పుడు లెక్కలు చెబితే ఊరుకోనని గొడవ చేసినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో ఏమో గాని.. ప్రస్తుతం ఆ ఇగో ప్రాబ్లెమ్స్ తో కూడిన గొడవలు అలా కంటిన్యూ అవుతున్నాయని వెబ్ మీడియాలో  స్టోరీలు పుడుతున్నాయి. మరి దీని సంగతేంటో తెలియాలంటే.. ఎవరో ఒకరు ఓపెన్ అవ్వాల్సిందే.