పాక్ తో రానా యుద్ధం.. ఘాజి అద్భుతం 

టాలీవుడ్ భల్లాలదేవుడు రానా దగ్గుబాటి భారతదేశ చరిత్రలో గొప్ప అధ్యాయంగా నిలిచిన ఓ రియల్ స్టోరీతో ‘ఘాజి’ అనే సినిమా చేస్తున్నాడని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇండియాలో తెరకెక్కుతున్న తొలి సబ్ మెరైన్ వార్ మూవీగా రికార్డుల్లోకి కూడా ఎక్కేసిన ఈ ‘ఘాజీ’ 1971 నాటి ఇండియా – పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా సాగుతుంది. అప్పట్లో ఆ యుద్ధంలో ఇండియన్ నేవీ చూపించిన తెగువ, చేసిన పోరాటం, ఆయా పరిస్థితులపై ఓ పుస్తకం రాసిన సంకల్ప్ రెడ్డి అనే కుర్రాడే ఇప్పుడు ‘ఘాజీ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దర్శకుడిగా తొలి ప్రయత్నమే అయినా.. తాజాగా రిలీజైన ‘ఘాజి’ ట్రైలర్ ను చూస్తే.. డైరెక్టర్ కి సెల్యూట్ చెయ్యాల్సిందే.

ముందుగా ‘ఘాజి’ ట్రైలర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. అద్భుతమనే అనాలి. అసలు పాకిస్థాన్, భారత్ అమ్ములపొదలోని నేవీకి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ ను టార్గెట్ చేస్తూ మనతో యుద్ధం చేయాలని ప్లాన్ చేస్తే.. అప్పుడు ఇండియన్ నేవీ ఎలా సమర్థవంతంగా పాక్ ప్లాన్ ను తిప్పికొట్టిందనే కథను ఎంచుకోవడంలోనే ‘ఘాజి’ సినిమా సగం విజయం సాధించేసిందనే చెప్పొచ్చు. ఇక ట్రైలర్ ను చూస్తే.. ఆ విజయం తాలూకూ ఘట్టాన్ని ఎంత అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారో అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ విజువల్స్, వార్ సన్నివేశాలు, అండర్ వాటర్ లో పోరాట దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి. బాహుబలి, రోబో 2.0 తదితర సినిమాల తర్వాత ‘ఘాజి’ కూడా ఇండియన్ సినిమా స్టాండర్డ్ ను పెంచినట్లు కనిపిస్తుంది.
ఇక ట్రైలర్ స్టార్టింగ్ లోనే.. ‘యుద్ధం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించేయడం కాదు.. శతృవు ప్రాణాలు తీసి గెలవడం’ అనే డైలాగ్ కథలోని ఎమోషన్ ను ఎలివేట్ చేస్తోంది. ఆ తర్వాత పాక్ ప్లాన్ ను ఇండియన్ ఆఫీసర్స్ డీకోడ్ చేయడం, పాక్ తన సబ్ మెరైన్ ను కరాచీ నుంచి ఇండియాలోని విశాఖపట్నం తీరానికి పంపుతున్న విషయాన్ని తెలుసుకోవడం.. దాంతో లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ (రానా) కు బాధ్యతలు అప్పగిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ ఎటాక్ మనం చేయకూడదని అనడం కథను ఇప్పుడే చెప్పేస్తున్నా కూడా మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆతృతను కలిగిస్తోంది. అంతేకాకుండా పాక్ తో యుద్ధంలో భాగంగా రానా అండ్ టీమ్ అండర్ వాటర్ లో చేస్తోన్న పోరాటాలు హాలీవుడ్ సినిమాను తలపిస్తూ రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి. అలాగే కథలోని మెయిన్ థీమ్ ను చెబుతూ రానా చెప్పిన డైలాగ్.. ‘ఈ పోరాటంలో మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు.. చరిత్రలో మనం ఉన్నా లేకపోయినా విశాఖపట్నం భవిష్యత్తులో, భారతదేశం భవిష్యత్తులో మనం నిలిచిపోతాం.. జైహింద్’ అనేది నరనరాల్లో దేశభక్తిని రగిలిస్తోంది. ఇక ఈ ‘ఘాజి’ కి రానాతో పాటు తాప్సి, నాజర్, ఓంపురి లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కూడా జతకట్టడం ప్రధాన బలంగా కనిపిస్తోంది. మరి అద్భుతమైన దృశ్యాలతో దేశభక్తిని తట్టిలేపుతున్న ఈ ‘ఘాజి’ ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే.. ఫిబ్రవరి 17 వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

ట్రైలర్ :