వావ్.. బాక్సింగ్ కోచ్ గా వెంకీ మాస్ రచ్చ

టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నటన, లుక్, స్టైల్.. ఇలా ప్రతీ దాంట్లో వెంకీ తనకంటూ సొంతంగా ఓ బ్రాండ్ నే ఏర్పరుచుకున్నాడు. ఆ బ్రాండ్ ను ఇష్టపడని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదేమో. అంతలా తన పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసే వెంకీ.. మరోసారి సినీ ప్రేమికులను అలరించడానికి ‘గురు’ గా వచ్చేస్తున్నాడు. బాలీవుడ్ లో దుమ్మురేపిన ‘సాలా ఖడూస్’ కు మాతృకైన తమిళ సూపర్ హిట్ సినిమా ‘ఇరిధిసుట్రు’ కు రీమేక్ గా వస్తోన్న ఈ ‘గురు‘ లో వెంకీ బాక్సింగ్ కోచ్ గా నటిస్తున్నాడని ఇంతకుముందే చెప్పుకున్నాం. అంతేకాకుండా తమిళ, హిందీ భాషల్లో ఈ కథను తెరకెక్కించిన సుధా కొంగరయే ఇప్పుడు తెలుగులో ‘గురు‘ కు కూడా దర్శకత్వం వహించారని, అలాగే రెండు భాషల్లోనూ హీరోయిన్ గా నటించిన రితికా సింగ్ ఇప్పుడు తెలుగులో ‘గురు‘ కు కూడా జోడీగా నటించిందని కూడా చెప్పుకోవడం జరిగింది.

ఇక ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చిత్ర యూనిట్ తాజాగా ‘గురు’ లేటెస్ట్ టీజర్ ను రిలీజ్ చేసింది. ఈ టీజర్ ను చూసిన వెంటనే ఎవ్వరైనా వావ్ అనాల్సిందే. ఎందుకంటే.. బాక్సింగ్ కోచ్ గా వెంకీ తన లుక్ తోనే మాస్ రచ్చ లేపుతున్నాడు కాబట్టి. ముఖ్యంగా వెంకీ మార్క్ ట్రెండ్ సెట్టింగ్ సినిమా ‘ధర్మచక్రం’ లుక్ ను గుర్తు చేస్తూ.. పొగరు, సత్తా ఉన్న బాక్సింగ్ కోచ్ గా వెంకీ పెర్ఫార్మెన్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. రీమేక్ సినిమా అయినప్పటికీ.. తనదైన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, హార్డ్ వర్క్ లాంటి వన్నీ చూపిస్తూ వెంకీ మేకోవర్ అయిన విధానం విజిల్స్ వేయిస్తోంది. ప్రధానంగా ఆ కళ్ళల్లో ఇంటెన్సిటీ చూస్తుంటే.. ఈసారి వెంకీ బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. బాక్సింగే నా ప్రపంచం అంటూ కథను స్టార్ట్ చేసిన వెంకీ.. పాపం ఆడపిల్లలు బాక్సింగ్ కొంచెం సున్నితంగా చెప్పండి అంటే.. ‘అలా చేస్తే వాళ్ళు నీలాగే జీవితాంతం మరుగుదొడ్లు కడుక్కుంటూ చస్తారు’ అంటూ నాజర్ తో వెంకీ చెప్పిన డైలాగ్ సన్నివేశాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది. ఇక ఆ తర్వాత వెంకీ తన కళ్ళలోని ఇంటెన్సిటీ మొత్తం చూపిస్తూ.. ‘మీరు నేను చెప్పిందే వింటారు, చెప్పిందే తింటారు, ఇల్లు వాకిలి ప్రేమ దోమ చెత్తా చెదారం అన్నీ పక్కనపెట్టి ఒళ్ళు వంచి ఫ్రేమ్ చేయండి.. లెర్న్ టు బి ద బెస్ట్ ఆర్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్’ అంటూ చెప్పిన డైలాగ్ సినిమా స్థాయిని వెంకీ తన టాలెంట్ తో ఎంతలా పెంచాడో చూపిస్తుంది. ఈ సందర్బంగా సంతోష్ నారాయణన్ అందించిన సంగీతాన్ని కూడా మెచ్చుకుని తీరాల్సిందే. సినిమా మూడ్ కి తగ్గట్లుగా ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలరిస్తుంది. అయితే, ఇదంతా బాగానే ఉన్నా.. ఈ ‘గురు’ ను సమ్మర్ కి వాయిదా వేయడం మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తోంది. మరి వెంకీ మార్క్ పెర్ఫార్మెన్స్ చూడాలంటే.. అప్పటివరకు వెయిట్ చేయక తప్పదు మరి.

టీజర్ :