హాలీవుడ్ నటుడితో నితిన్ ఏం చేస్తున్నాడో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఆ మధ్య ‘అ.. ఆ..’ సినిమాతో సూపర్ హిట్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంచెం టైమ్ తీసుకుని ఎట్టకేలకు ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తన కొత్త సినిమా ‘లై’ ను పట్టాలెక్కించాడు. ఇక ఇప్పటికే రిలీజైన ‘లై’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ సినిమా కోసం నితిన్ భారీగా గెడ్డం పెంచేసి చేసిన మేకోవర్ మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. ఇకపోతే, ప్రస్తుతం ఈ సినిమా అమెరికాలో సుదీర్ఘమైన షెడ్యూల్ జరుపుకుంటుండటం విశేషం. ఈ క్రమంలో ఈ సినిమా కోసం అక్కడే ఓ హాలీవుడ్ నటుడిని తీసుకోవడం హాట్ మేటర్ అయింది.

ఆ స్టోరీలోకి వెళితే, హాలీవుడ్ నటుడు డాన్ బిల్జరియాన్ తమ ‘లై’ చిత్రంలో నటిస్తున్నాడని తాజాగా నితిన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. దీంతో ఈ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రధానంగా ఇప్పుడు స్టంట్ మ్యాన్, ప్రొఫెషనల్ పోకర్ ప్లేయర్ అయిన డాన్ బిల్జరియాన్.. హాలీవుడ్ లో ఒలంపస్ హాజ్ ఫాలెన్, ది ఈక్వలైజర్, ఎక్స్ ట్రాక్షన్, వార్ డాగ్స్ వంటి చిత్రాల్లో నటించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అందుకే ఈ హాలీవుడ్ నటుడు తమ చిత్రంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేసిన నితిన్.. డాన్ బిల్జరియాన్ సహజమైన యాక్టర్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. అలాగే ఈ హాలీవుడ్ నటుడితో సరదాగా ముచ్చటిస్తున్న కొన్ని పిక్స్ ను కూడా నితిన్ పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే, మొత్తంగా రెండున్నర నెలల పాటు ఈ ‘లై’ చిత్రాన్ని అమెరికాలో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ భారీ షెడ్యూల్ లోనే హాలీవుడ్ నటుడు డాన్ బిల్జరియాన్ తో యాక్షన్ పార్ట్ ను చాలావరకు కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తుంటే, టాలీవుడ్ అంతకంతకూ ఎదిగిపోతున్నట్లే కనిపిస్తోంది.