నేనేమీ పిల్లలను కనే మెషీన్ ను కాదు – స్టార్ హీరోయిన్ 

సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ప్రశ్నలు అడగడానికి మీడియా వాళ్ళు ఎప్పుడూ ముందుంటారనే విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా వేదిక ఏదైనా సరే హీరోయిన్లను చిరాకు తెప్పించే ప్రశ్నలు వేస్తూ కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ను కూడా ఇలానే ఇబ్బంది పెట్టారు. అందులోనూ విద్యాబాలన్ పెళ్లి చేసుకున్న హీరోయిన్ కావడంతో.. రెగ్యులర్ గా అడిగే ప్రశ్న ఒకటి అరిగిపోయే వరకు అడుగుతూ ఎక్కడా తగ్గకుండా చిరాకు తెప్పిస్తున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే, 2012లో యూటీవీ సిద్దార్ద్ రాయ్ కపూర్ ను వివాహం చేసుకున్న విద్యాబాలన్.. అప్పటి నుంచీ సినిమాలతోనే బిజీగా ఉంది గాని, ఇప్పటివరకు పిల్లల్నయితే కనలేదు. ఈ క్రమంలో తన లేటెస్ట్ మూవీ ‘బేగం జాన్’ ప్రమోషన్స్ చేస్తోన్న విద్యాబాలన్ కు తాజాగా… పిల్లల విషయంలోనే మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దీంతో ఈ సీనియర్ హీరోయిన్ ఇంక కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తన మాటల తూటాలు నాన్ స్టాప్ గా పేల్చేసింది. ముందుగా ఇప్పటికీ పిల్లలను కనకపోవడంపై ఘాటుగా, డైరెక్ట్ గా మాట్లాడిన విద్యాబాలన్.. ఈ విషయం నాకు నా భర్తకు తప్ప వేరే ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదని అంటూ మీడియా వాళ్లపై మండిపడింది. అనంతరం.. ‘పిల్లలపై అంత మమకారం ఎందుకు.. నేనేమీ పిల్లలను తయారుచేసే మెషీన్ ను కాదు.. ఇప్పుడు ప్రపంచ జనాభా ప్రమాదకర స్థాయికి చేరిపోయింది.. అలాంటప్పుడు ఒక జంటకి పిల్లలు లేకపోయినా ఏం పర్లేదు.. పిల్లలు ఖచ్చితంగా ఉండాలనే రూలేమీ లేదు’ అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. దీంతో అక్కడున్న మీడియా జనాలకు షాక్ కొట్టినంత పనైంది.