బాలుకి ఇళ‌య‌రాజా లీగ‌ల్ నోటీసు

ప్ర‌ముఖ సింగ‌ర్ ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యంకి సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌యారాజా లీగ‌ల్ నోటీసులు పంపించారు. ఇక‌పై త‌న ప‌ర్మిష‌న్ లేకుండా వేదిక‌ల‌పై తాను స్వ‌ర‌ప‌రిచిన పాట‌లు పాడ‌కూడ‌ద‌ని బాలుతో పాటు, మ‌రికొద్దిమంది సింగ‌ర్ల‌కి ఆయ‌న లీగ‌ల్ నోటీసులు పంప‌డంతో ద‌క్షిణాది చిత్ర‌సీమ‌ల్లో క‌ల‌క‌లం రేగింది. బాలు విదేశాల్లో కీల‌క‌మైన మ్యూజిక్ క‌న్స‌ర్ట్‌ల్లో  పాల్గొన‌డానికి వెళ్లే ముందు ఈ ర‌క‌మైన నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే ఆ నోటీసుల‌పై బాలు కూడా ప్ర‌తిస్పందించారు. “ఇన్నాళ్లూ ప‌లు వేదిక‌ల‌పై పాట‌లు పాడిన‌ప్ప‌టికీ ఎక్క‌డా అభ్యంత‌రం చెప్ప‌లేదు,  ఇప్పుడు మాత్రం నోటీసులు పంపారు. అయినా ఫ‌ర్వాలేదు. నేను జ‌ర‌ప‌ద‌ల‌పెట్టిన క‌న్స‌ర్టులు య‌థావిధిగానే జ‌రుగుతాయి. నేను, మా బృందం ఇత‌ర సంగీత ద‌ర్శ‌కుల పాట‌లు పాడుతాం“ అని ఫేస్‌బుక్‌ద్వారా స్ప‌ష్టం చేశారు బాలు. అయితే ఈ ఇద్ద‌రు ఉద్ధండుల మ‌ధ్య ఏర్ప‌డిన ఈ వివాదంపై ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. మామూలుగా  పాట‌ల‌కి, ట్యూన్ల‌కి కాపీరైట్స్ ఉంటాయి. బ‌హిరంగ వేదిక‌ల‌పై ఎక్క‌డ పాట‌ని ఉప‌యోగించినా సంగీత ద‌ర్శ‌కుల‌కి, ఆ పాట రాసిన ర‌చ‌యిత‌ల‌కి కాపీరైట్స్ నిబంధన‌ల‌కి అనుగుణంగా కొంచెం మొత్తం చెల్లించాల‌నే నిబంధ‌న‌లు ఉన్నాయి. మ‌రి ఆ  నిబంధ‌న‌లు స‌రిగ్గా అమ‌లు కాక‌పోతుండ‌డంతోనే ఇళ‌యారాజా త‌న గీతాల్ని వినియోగిస్తున్న‌వాళ్లంద‌రికీ ఈ ర‌క‌మైన నోటీసులు పంపుతున్నారా, లేక ఇత‌ర‌త్రా కార‌ణాలేమైనా ఉన్నాయా అనే విష‌యం తెలియాల్సి వుంది.