నాక్కూడా అలా జరిగిందంటున్న కాజల్

సినీ పరిశ్రమలో హీరోయిన్ గా రాణించాలంటే కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వాలి.. చాలా విషయాల్లో రాజీ పడటానికి రెడీగా ఉండాలి.. అంటూ ఈ మధ్య వార్తల్లో హాట్ టాపిక్ గా కొన్ని స్టోరీలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది కథానాయికలు ఈ మధ్య నిర్భయంగా మాట్లాడుతూ.. ఈ ‘కాంప్రమైజ్’ అవడంపై ఓపెన్ అయిపోవడంతో చర్చనీయాంశం అవుతుంది. ఇదే సమయంలో ఈ విషయంలో ఇప్పటి హీరోయిన్లకు ఒకప్పటి గ్లామర్ తారలు కూడా వంతపాడుతుండటంతో.. సరికొత్త వివాదాలకు తెర తీసినట్లు అవుతుంది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ విషయంపై మన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తన స్పందన తెలియజేసి చిన్నపాటి షాకే ఇచ్చింది.

ముందుగా కథానాయికల కాంప్రమైజ్ గురించి మీరేం చెబుతారు? మీకలాంటి పరిస్థితి ఎదురైందా? అనే ప్రశ్నలు కాజల్ ను సూటిగా అడిగితే.. దానికి కాజల్ స్పందిస్తూ.. నిజానికి నాకలాంటి పరిస్థితి ఎదురుకాలేదని, అయితే దాని గురించి విన్నానని, కొంతమంది హీరోయిన్లు తమకు ప్రతిభ ఉన్నా కూడా అవకాశాల కోసం ఎలా రాజీపడాల్సి వచ్చిందో చెప్పారని, అది చాలా బాధాకరమని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో పాటల్లో హీరోయిన్లను అభ్యంతరకరంగా చూపించే విషయం గురించి కాజల్ ను అడిగితే.. అది నాక్కూడా జరిగిందని, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకేం తెలిసేది కాదని, అందుకని అభ్యంతరకరంగా ఉండే దృశ్యాలు చేశానని, ఆ తర్వాత తప్పు తెలుసుకున్నానని, ఇక ఆ దారిలో వెళ్లకూడదని ఫిక్స్ అయ్యానని, అప్పటి నుంచి పాత్రలను చాలా కేర్ ఫుల్ గా ఎంపిక చేసుకుంటున్నానని కాజల్ వివరించింది. చివరగా ఇప్పుడు నేనున్న ఈ స్థాయి నాకు చాలా ఆనందంగా, సౌకర్యవంతంగా ఉందని, నాకేం నచ్చిందో అది చేసే హక్కు నాకుందని, ఎవరి కోసమో రాజీపడటంలో అర్థం లేదని తెలుసుకున్నానని కాజల్ స్పష్టం చేసింది.