కన్నడ పవర్ స్టార్ ను కంగారు పెడుతున్న పవన్!

టాలీవుడ్ సినిమాలు ఈ మధ్య కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గత కొన్నేళ్ల నుంచి కన్నడనాట తెలుగు సినిమాల జోరు బాగానే పెరిగింది. ప్రధానంగా మెగా హీరోలకు కర్ణాటకలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే చాలు అక్కడ కూడా సందడి నెలకొంటుంది. అందుకే పవన్ సినిమా వస్తుందంటే.. అక్కడ కన్నడ సినిమాల్ని రిలీజ్ చేయడానికి కూడా ఆలోచిస్తారట. ఈ క్రమంలో ఇప్పుడు అక్కడ అందరి చూపు ఈ నెల 24నే రాబోతున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘కాటమరాయుడు’ పై పడింది.

అయితే, అనుకోకుండా కన్నడ యువ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కొత్త సినిమా ‘రాజకుమార’ కూడా పవన్ ‘కాటమరాయుడు’ రిలీజ్ అవుతున్న రోజుకే షెడ్యూల్ అవడం గమనార్హం. అంటే ‘రాజకుమార’ మూవీ కూడా ఈ నెల 24 నే రిలీజ్ అవుతుంది. ఇక ఇక్కడ అసలైన విశేషం ఏంటంటే.. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే, కన్నడ పవర్ స్టార్ వేరెవరో కాదు.. పునీత్ రాజ్ కుమారే. అంటే కన్నడ అభిమానులు పునీత్ రాజ్ కుమార్ ను కూడా పవర్ స్టార్ అనే పిలుచుకుంటారు. కానీ, ఇప్పుడు ఊహించని విధంగా మన పవర్ స్టార్ ను చూసి కన్నడ పవర్ స్టార్ భయపడుతున్నాడట. దానికి కారణం ఇప్పుడు పవన్ ‘కాటమరాయుడు’ కన్నడ నాట పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుండటమే.
ముఖ్యంగా బెంగళూరు, బళ్లారి లాంటి ప్రాంతాల్లో ఎప్పటిలాగే ఈ సినిమాను కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారట. దీంతో ఇప్పుడు కాటమరాయుడు క్రేజ్ చూసి పునీత్ ‘రాజకుమార’ సినిమా నిర్మాతలు కంగారు పడుతున్నారట. ప్రధానంగా రాజకుమార సినిమా ఓపెనింగ్స్ కు పవన్ సినిమా గండి కొడుతుందని భావిస్తున్నారట. అందులోనూ కన్నడ నాట ‘రాజకుమార’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుండటంతో.. కాటమరాయుడు వల్ల వసూళ్లపై ప్రభావం తప్పదేమోనని ఆలోచిస్తున్నారట. అంతేకాకుండా కాటమరాయుడుకు గనుక పాజిటివ్ టాక్ వస్తే.. కొన్ని ఏరియాల్లో ‘రాజకుమార’ కు దెబ్బ తప్పదని అంచనా వేస్తున్నారట. ఈ విధంగా ఇప్పుడు కన్నడ పవర్ స్టార్ ను తెలుగు పవర్ స్టార్ కంగారు పెడుతున్నాడని అంటున్నారు.