షాకింగ్.. దేవతను అవమానించిన పాప్ స్టార్

ఫేమస్ పాప్ స్టార్ కేటీ పెర్రీ ప్రస్తుతం ఇండియన్ నెటిజన్స్ నుంచి ఓ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ 32 ఏళ్ళ టాలెంటెడ్ సింగర్ తాజాగా హిందూ ఆరాధ్య దేవత కాళికా మాత ఫోటోను పోస్ట్ చేసి ‘ప్రస్తుతం నా మూడ్’ అంటూ ట్వీట్ చేయడంతో వివాదం రాజుకుంది. ముఖ్యంగా ఇండియన్ నెటిజన్స్ హిందూ దేవతను అవమానించిందంటూ కేటీ పెర్రీపై విరుచుకుపడుతున్నారు.ఇదే సమయంలో భారతీయ దేవతలను అగౌరవ పరచొద్దని, మూడ్ చెప్పేందుకు ఇలాంటివి వాడడం సరికాదని, ఇలాంటివి హిందూ సమాజానికి బాధను కలిగిస్తాయని, విలువలు పట్టించుకోవాలని.. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ కేటీ పెర్రీని తిట్టిపోస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం ఈ విషయంలో కేటీ పెర్రీకి మద్దతుగా నిలుస్తుండటం విశేషం.

అందులోనూ విమర్శించే వాళ్ళను విమర్శిస్తూ.. ఇలా ఏదో ఒక పాయింట్ పట్టుకుని హంగామా చేయడం ఎక్కువైపోయిందని, వాటిని పట్టించుకోవద్దని చెబుతూ కేటీ పెర్రీ చేసిన పనిలో పెద్దగా తప్పేమీ లేదని అంటుండటం గమనార్హం. ఇదిలా ఉంటే, కేటీ పెర్రీకి హిందూ సంప్రదాయాలంటే అంత చులకన భావం ఏమీ లేదని అందరూ తెలుసుకుంటే బాగుంటుందని కొందరు అంటున్నారు. ఎందుకంటే, 2010లో కేటీ పెర్రీ తన ప్రియుడు రసెల్ బ్రాండ్ ను పెళ్లి చేసుకునేందుకు ఏకంగా ఇండియాలోని రాజస్థాన్ వచ్చి భారతీయ సంప్రదాయం ప్రకారం మ్యారేజ్ చేసుకుంది. ఇలా కొంచెం అభిమానం ఉండటంతోనే ఈ పాప్ స్టార్ తన పీలింగ్స్ ను దేవతతో పోల్చి చెప్పిందని అర్థమవుతుంది. అయితే, ఇలా చేయడం ఇక్కడ ఏ ఇండియనో కాకుండా కేటీ పెర్రీ ఫారినర్ కావడంతో విమర్శకులు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని కొంతమంది వాదిస్తున్నారు. మరి ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.