ఎన్టీఆర్ రికార్డును దాటలేకపోయిన చిరు ‘ఖైదీ నంబర్ 150’ 

తెలుగు సినీ ప్రపంచంలో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ ప్రభంజనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. చిరు తొమ్మిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తూ చేస్తోన్న సినిమా కావడంతో.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షో ల ద్వారా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన మెగాస్టార్.. తెలుగు రాష్ట్రాల ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా కలుపుకుంటే.. ఎవ్వరికీ సాధ్యంకాని ‘బాహుబలి’ రికార్డులను చాలావరకు బాస్ బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు ఇలా ఉంటే, మరోవైపు ఇంత భారీ అంచనాలతో వస్తోన్న మెగాస్టార్ తన ‘ఖైదీ నంబర్ 150’ తో అందుకోలేకపోయిన రికార్డుల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి.
అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ కు సంబంధించిన ఓ రికార్డు కూడా ఉండిపోవడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. ఆ వివరాలలోకి వెళితే, ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘జనతా గ్యారేజ్’ 2016లో ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా పలు రికార్డులను కూడా సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రిలీజైన మెగా ఖైదీకి ఆ రికార్డులను దాటేయడం పెద్ద విషయమేమీ కాదు. అయితే, ఓ రికార్డును మాత్రం మెగాస్టార్ దాటలేకపోయారు. అదేంటంటే.. మన తెలుగు స్టార్ హీరోల సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా భారీగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే కర్ణాటకలో రిలీజ్ కు ముందు స్పెషల్ ప్రీమియర్ షో లు కూడా భారీగానే వేస్తున్నారు.
ఇప్పుడు ఆ ప్రీమియర్ షో ల విషయంలోనే ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ ను చిరు ‘ఖైదీ నంబర్ 150’ దాటలేకపోయిందట. ఇంతకుముందు కన్నడనాట ‘జనతా గ్యారేజ్’ కు 24 ప్రీమియర్ షో లు వేస్తే.. ఇప్పుడు ‘ఖైదీ నంబర్ 150’ కి 18 స్పెషల్ ప్రీమియర్ షో లు మాత్రమే వేస్తున్నారట. ఇదిలా ఉంటే, ఈ ‘జనతా గ్యారేజ్’ రికార్డును ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘ధృవ’ సినిమాతోనే అధిగమించాలని ప్లాన్ చేశారట. అయితే, ‘ధృవ’ సినిమా కన్నడనాట కేవలం 14 ప్రీమియర్ షో లతోనే ఆగిపోయిందని సమాచారం. దీంతో ఇప్పుడు మెగాస్టార్ ఆ రికార్డును బద్దలు కొడతారని అనుకుంటే.. చిరు 18 దగ్గరే ఆగిపోయారు. ఈ లెక్కన చూస్తుంటే.. ఎన్టీఆర్ రికార్డును బద్దలు కొట్టాలంటే ‘బాహుబలి-2’ రావాలి తప్ప, ఏ హీరో వల్ల కాదేమో అన్నట్లు ఉంది.