ఆ పరిస్థితుల్లో బాలయ్యను చూసిన విదేశీయులు..?

నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఇంకొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ సినిమా తెరకెక్కిన విధానం ఇప్పటికీ సినీ లవర్స్ కు కూడా వండర్ గానే అనిపిస్తోంది. ముఖ్యంగా 79 వర్కింగ్ డేస్ లోనే చారిత్రక నేపథ్యం ఉన్న శాతకర్ణి లాంటి విజువల్ వండర్ ను తెరకెక్కించారంటే.. చిత్ర యూనిట్ సభ్యులు ఎంత కష్టపడి ఉంటారో చెప్పడం కష్టమని సినీ లవర్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ బాలయ్య లాంటి సీనియర్ హీరోతో ఈ సినిమాను ఇంత వేగంగా పూర్తి చేయడం అంటే.. అది నిజంగా విశేషమే అంటున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం బాలయ్య పడ్డ కష్టం గురించి డైరెక్టర్ క్రిష్ తో పాటు మిగిలిన మూవీ యూనిట్ లోని ప్రముఖులు కూడా చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలయ్యకు సంబంధించిన మరో గొప్ప సంఘటనను క్రిష్ అందరితో పంచుకున్నాడు. ఆ స్టోరీలోకి వెళితే, శాతకర్ణి షూటింగ్ లో భాగంగా మొరాకోలో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు.. ఓ ఘట్టంలో గౌతమీపుత్ర శాతకర్ణి తన బిడ్డ పులోమావిని తీసుకుని యుద్ధానికి బయలుదేరే సన్నివేశాన్ని చిత్రీకరించడం స్టార్ట్ చేశారట. అందులో భాగంగా బాలయ్య ఆ పసిబిడ్డను ఎత్తుకుని గుర్రంపై వెళ్తుండగా చుట్టూ అగ్నిగోళాలు మండుతూ ఉంటాయట.

అయితే, అలా జరగకుండా గుర్రం కొంచెం ముందుకెళ్లాక అగ్ని గోళాలు ఓ వైపు మాత్రమే పేలి, రెండో వైపు ఆగిపోవడంతో.. గుర్రం ఒక్కసారిగా పక్కకి తిరిగిందట. దాంతో బాలయ్య గుర్రం మీద నుంచి చేతిలో ఉన్న పసిబిడ్డతో సహా కిందపడిపోయారట. ఆ టైమ్ లో ఎంతో కష్టపడి బిడ్డకు ఏ మాత్రం ప్రమాదం జరగకుండా భద్రంగా ఒడిసిపట్టుకోవడమే కాకుండా.. బిడ్డకు కవచంలా బాలయ్య నిలిచారట. అంతేకాకుండా ఆ పరిస్థితుల్లో తన గురించి కూడా పట్టించుకోకుండా.. బిడ్డకి ఏం కాలేదు కదా అంటూ బాలయ్య ఆందోళన వ్యక్తం చేశారట. అనంతరం కేవలం అరగంట మాత్రమే విశ్రాంతి తీసుకుని మళ్ళీ షూటింగ్ కి వచ్చి డబుల్ ఎనర్జీతో యుద్ధ సన్నివేశాల్లో నటించారట. ఇదంతా చూసిన మొరాకోలోని అక్కడి విదేశీయులు మీ హీరో రియల్ హీరో అంటూ మెచ్చుకున్నారని తాజాగా డైరెక్టర్ క్రిష్ స్వయంగా వెల్లడించారు. అందుకే మరి ఫ్యాన్స్ ఇక్కడ జై బాలయ్య అనేది.. అని ఇప్పుడు అర్థమవుతుంది కదా.