ప్రారంభం కాకుండానే పోటీ పడుతున్న మహేష్ – పవన్ 

టాలీవుడ్ కు తిరుగులేని స్టార్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులు ప్రస్తుతం ఎప్పుడూ లేనంత బిజీబిజీగా షూటింగ్ లతో గడిపేస్తున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలతో విరామం లేకుండా కష్టపడుతున్న ఈ స్టార్స్ ఇద్దరూ రీసెంట్ గా న్యూ ఇయర్ వెకేషన్స్ ను పూర్తి చేసుకుని మళ్ళీ తమ షూటింగ్ లను స్టార్ట్ చేసేశారు. అందులో భాగంగా మహేష్.. మురుగదాస్ డైరెక్షన్లో కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఇటు పవన్ తన ‘కాటమరాయుడు’ కు సంబంధించి కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ల షూటింగ్ లో దుమ్మురేపుతున్నాడట.
ఇదిలా ఉంటే, ఇప్పుడు పవన్ – మహేష్ లు తమ తదుపరి సినిమాలతో పోటీ పడనున్నారనే న్యూస్ రావడం విశేషం. అదేంటి.. ఇంకా ప్రారంభమే కాలేదు అప్పుడే పోటీ ఏంటని అనుకుంటున్నారా?.. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ స్టోరీలోకి వెళితే, పవన్ ఈ నెలాఖరుకే తన ‘కాటమరాయుడు’ సినిమాను పూర్తి చేసి వెంటనే త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేయాలని భావించాడట. అయితే, ‘కాటమరాయుడు’ షూటింగ్ ఆలస్యం అవడంతో.. దీనిని ఎలాగైనా ఫిబ్రవరి చివరికల్లా ఫినిష్ చేసి.. మార్చి మొదటివారం నుంచి త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించేలా పవన్ ప్లాన్ చేసుకున్నాడట.
మరోవైపు, మహేష్ బాబు కూడా మురుగదాస్ సినిమాను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేసి కొరటాల శివతో కొత్త సినిమాను స్టార్ట్ చేయాలనుకుంటే.. నాటకీయంగా ఇది కూడా ఆలస్యం కావడం విశేషం. దీంతో ఇప్పుడు మహేష్ కూడా మార్చి మొదటి వారంలోనే కొరటాలతో తన కొత్త సినిమాను స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇలా మహేష్ – పవన్ లు సినిమాల ప్రారంభానికే పోటీ పడుతున్నారని అనుకుంటే.. తర్వాత రిలీజ్ డేట్ కూడా వీరి మధ్య పోటీ తప్పేలాలేదని చెబుతుండటం ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. కరెక్ట్ గా చెప్పాలంటే.. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్, మహేష్ బాబు – కొరటాల సినిమాలు రెండూ కూడా ఇప్పుడు దసరా రిలీజ్ ను టార్గెట్ చేసుకునే తెరకెక్కబోతున్నాయట. అంటే, ఇంకా సరిగ్గా ప్రారంభం కాకుండానే పవన్ – మహేష్ లు అప్పుడే పోటీ పడిపోతున్నారని అర్థం. మరి ఇదే నిజమైతే, ఫ్యాన్స్ కు ఎలా ఉన్నా.. సినీ లవర్స్ కు మాత్రం ఈ ఏడాది దసరా పండుగ మహేష్, పవన్ సినిమాలతో సూపర్ పవర్ ఫుల్ గా జరుగుతుంది.