చంద్రబాబు ఆరోగ్యంపై మంచు లక్ష్మి కామెంట్లు

టాలీవుడ్ లో నటిగా తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతున్న మంచు లక్ష్మి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఆమె మాటలు సరదా సరదాగా ఉంటాయనే విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ముద్దుముద్దు మాటలతోనే తనచుట్టూ ఉన్న వాళ్ళను మంచు లక్ష్మి అలరించింది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు గురించి మంచువారమ్మాయి చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి. ఆ స్టోరీలోకి వెళితే, తాజాగా విజయవాడలో జరిగిన అమరావతి మారథాన్ ప్రారంభ కార్యక్రమంలో మంచు లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా మంచు లక్ష్మి ప్రసంగిస్తూ.. మన లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పులతో ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని, అది మంచి పద్ధతి కాదని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు నిత్యం వ్యాయామం చేయడం వల్లనే ఆయన చాలా హ్యాండ్సమ్ గా, స్ట్రాంగ్ గా ఉన్నారని మంచు లక్ష్మి ప్రశంసించడం చంద్రబాబుతో సహా అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మితో పాటు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రి కామినేని, బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మేస్కె ప్రసాద్, డీజీపీ సాంబశివరావు, నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం మారథాన్ విజేతలకు ట్రోఫీలు ఇచ్చి నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్బంగా ఇథియోఫియా దేశానికి చెందిన ఇద్దరు మహిళా క్రీడాకారులు మారథాన్ లో పాల్గొని విజేతలుగా నిలవడం విశేషం.