వావ్.. నిజమా.. రూ.600 కోట్లతో సూపర్ స్టార్ సినిమా 

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా నిలిచిన ‘బాహుబలి’ కి అప్పట్లో రూ. 250 కోట్ల బడ్జెట్ అంటే.. దేశంలోని తలపండిన సినీ ప్రముఖులు కూడా వామ్మో అనుకున్నారు. కానీ, బాహుబలి రిజల్ట్ చూశాక టాలీవుడ్ కు తిరుగులేదని రుజువైంది. ఇక ఇప్పుడేమో సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో రోబో సీక్వెల్ ‘2.0’ సినిమాను ఏకంగా రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తుంటే.. ముందు ఆశ్చర్యపోయినా తర్వాత మార్కెట్ దృష్ట్యా ఇది రిస్క్ కాదనే మాట వినిపించింది. ఇదిలా ఉంటే, మరో తమిళ సీనియర్ డైరెక్టర్ సుందర్ ఈ మధ్య ఓ రూ. 350 కోట్లతో నేను కూడా ఓ భారీ సినిమా తీయబోతున్నానని చెబుతూ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. వీళ్లందరినీ కాదని రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ ఏకంగా రూ. 340 కోట్లతో ‘న్యూక్లియర్’ అనే ఇంటర్నేషనల్ మూవీ తీస్తున్నానని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు.
ఇక ఇప్పుడేమో.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇప్పటినుంచి ఓ లెక్క.. నేనొచ్చానని చెప్పు, అన్నట్లుగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ  షాకింగ్ న్యూస్ తో ఇండియన్ సినిమాను షేక్ చేస్తుండటం విశేషం. అసలు విషయం ఏమిటంటే.. మోహన్ లాల్ ఏకంగా రూ. 600 కోట్ల బడ్జెట్ తో ఇప్పుడు ఓ భారీ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ కలకలం రేపుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని.. ఎమ్.టి. వాసుదేవ నాయర్ రచించిన ‘ర్యాండమ్ఊజమ్’ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుందని, మహాభారతంలో భీముని ధృక్కోణంలో సాగే కథ ఇదని మలయాళం సర్కిల్ లో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది.
అంతేకాకుండా 600 కోట్ల రూపాయలతో భారీ హంగుల మధ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, ఈ ఏడాది చివర్లోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని టాక్ కొంచెం గట్టిగానే వినిపిస్తుంది. అయితే, ఇదే సమయంలో మలయాళం సినిమా మార్కెట్ పరిధి చాలా తక్కువ కదా, అక్కడ కేవలం 50 కోట్ల రూపాయలతో ఓ సినిమా తీసినా అది వండర్ గా ఫీలవుతారు.. అలాంటిది 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సినిమా ఏంటనే డౌట్ కలగొచ్చు. కానీ, ఈ డౌట్ ను కూడా క్లారిఫై చేస్తూ.. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఇతర పరిశ్రమలకు చెందిన నటీనటులు కూడా ఉంటారని, ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పనిచేస్తారని.. అలాగే అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని మలయాళం మీడియా వర్గాలు చెబుతుండటం విశేషం. అలా అయితే 600 కోట్ల రూపాయల బడ్జెట్ పెద్ద రిస్క్ కాదనే అనొచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని కూడా మీడియా వర్గాలు చెబుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమవుతుంది.. ఈ ప్రాజెక్టు ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ముందుముందు చూడాలి.