మహేష్ స్పైడర్ క్లైమాక్స్ లో భారీ మార్పులు..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో గత కొన్ని నెలలుగా ‘స్పైడర్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసిందని అనుకుంటున్న టైమ్ లో.. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక షాకింగ్ ట్విస్ట్ రావడం హాట్ టాపిక్ గా మారింది. ఆ స్టోరీలోకి వెళితే, తెలుగు – తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కే సినిమాలకు ఎప్పటినుంచో ఎక్కువగా ఉన్న ఓ సెంటిమెంట్ ఇప్పుడు ‘స్పైడర్’ కు కూడా రిపీట్ అవుతుందట. ఆ సెంటిమెంట్ మరేదో కాదు.. రెండు క్లైమాక్స్ లు. రియలిస్టిక్ గా ఉండే సినిమాలను ఎక్కువగా ఇష్టపడే తమిళ ప్రేక్షకులు శాడ్ క్లైమాక్స్ కు బాగా కనెక్ట్ అవుతారనే విషయం తెలిసిందే. అయితే, లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లంటే పడి చచ్చిపోయే తెలుగు ప్రేక్షకులకు.. సినిమా కథను చివరకు సుఖాంతం చేస్తేనే నచ్చుతుందని చెబుతారు.
అందుకే ఇప్పటివరకు చాలా హిట్ సినిమాలు కూడా తెలుగు, తమిళ భాషల్లో వేరు వేరు క్లైమాక్స్ లతో అలరించాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాను ‘స్పైడర్’ కు సెట్ చేసే పనిలో మురుగదాస్ బిజీగా ఉన్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా మహేష్ కు తమిళ లాంచింగ్ మూవీ కావడంతో.. అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా, రియలిస్టిక్ గా ఉండేలా క్లైమాక్స్ లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, తెలుగులో మాత్రం ఎప్పటిలాగే ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చేలా కొంచెం హంగామాతో హీరోయిజం ఎక్కువగా ఎలివేట్ అయ్యేలా మురుగదాస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా తెలుగు, తమిళ భాషలకు తగినట్లుగా క్లైమాక్స్ ను రెండు రకాలుగా తీస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ కారణంగా ఇప్పుడు షూటింగ్ మరింత ఆలస్యం అవుతుందనే ఆందోళన మొదలవడం గమనార్హం. అంతేకాకుండా ఈ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు వల్ల ‘స్పైడర్’ రిలీజ్ డేట్ మారుతుందేమోనని.. అనుకున్న టైమ్ కి థియేటర్స్ కి వస్తుందో రాదో అని తెగ చర్చించేసుకుంటున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి.