బాలయ్య ‘శాతకర్ణి’ చూసి నారా లోకేష్ తప్పు చేశాడు..! 

తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ కొంచెం ముందుగానే మెగా, నందమూరి సినిమాలతో వచ్చేసిందని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పటికే మెగాస్టార్ తన ‘ఖైదీ నంబర్ 150’ తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంటే.. ఇప్పుడు బాలయ్య తన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తో బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అయిపోయారు. ఈ క్రమంలో స్పెషల్ షో ల ద్వారా ఇప్పటికే బాలయ్య ‘శాతకర్ణి’ కి సూపర్ హిట్ టాక్ వచ్చేయడం విశేషం. ఈ నేపథ్యంలోనే తాజాగా బాలయ్య తన కుటుంబ సభ్యుల కోసం రామానాయుడు స్టూడియోలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ స్పెషల్ షో ని ప్రత్యేకంగా ప్రదర్శింపజేయించారు. ఈ షో చూసిన వాళ్లలో బాలయ్య అల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఉండటం విశేషం. ఇక ఆ తర్వాత మూవీ చూసిన అనంతరం నారా లోకేష్ స్పందించడం మామూలు విషయమే అయినా.. ఆయన స్పందించిన తీరు మాత్రం ఇప్పుడు న్యూస్ అయింది.

ఆ న్యూస్ లోకి వెళ్లేముందు, ఏపీ సీఎంకు గాను ఒక ప్రత్యేక ట్విట్టర్ అకౌంట్ ఉంటుందని, @AndhraPradeshCM పేరుతో ఆపరేట్ అయ్యే ఆ అకౌంట్ నుంచి సీఎంకు సంబంధించిన అనేక ట్వీట్లను రోజూ వేస్తూ ఉంటారని గుర్తు చేసుకోవాలి. కానీ, ఆ అకౌంట్ నుంచే తాజాగా శాతకర్ణి సినిమాకు సంబంధించిన ఓ ట్వీట్ రావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అందులోనూ సీఎం అధికారిక ట్విట్టర్ ఖాతా అయిన దాంట్లో నారా లోకేష్ స్వయంగా.. ‘బాలయ్య మావయ్య.. అలాగే ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ చూసి నేను అబ్బురపడ్డాను.. గౌతమిపుత్ర శాతకర్ణి టీమ్ కు శుభాకాంక్షలు’ అంటూ ఆ ట్వీట్ చేయడం వెంటనే హాట్ న్యూస్ అయిపోయింది. అంతేకాకుండా సీఎం ట్విట్టర్ హ్యాండిల్ ను లోకేష్ ఆపరేట్ చేస్తున్నాడనే విషయాన్ని నెటిజన్లు ఖరారు చేసేసుకుని ఆదుకోవడం మొదలెట్టారు. దీంతో తన తప్పు తెలుసుకున్న లోకేష్.. వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేసి.. అదే ట్వీట్ ను తన పర్సనల్ అకౌంట్ నుంచి వేశారు. దీంతో మావయ్య సినిమా చూసిన ఆనందంలో లోకేష్ తప్పు చేశాడు అంటూ సరదా కామెంట్లు వెల్లువెత్తాయి. బాలయ్య తన ‘శాతకర్ణి’ తో ఆ రేంజ్ లో మాయ చేశాడని ఫ్యాన్స్ కూడా హ్యాపీగానే ఫీలవుతున్నారు.