హీరోయిన్ ను రోడ్డున పడేశారట..!

Nidhhi Agerwal asked vacate Mumbai house strange reason

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఊహించని కష్టం వచ్చిపడింది. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ తో కలిసి ‘మున్నా మైఖేల్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న నిధిని తాజాగా రోడ్డున పడేశారట. షాకింగ్ గా అనిపిస్తోన్న ఈ న్యూస్ లోకి వెళితే, సినీ ప్రపంచంలో వెలిగిపోవడానికి కర్ణాటక నుంచి ముంబై వచ్చేసిన నిధి అగర్వాల్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నాక బాంద్రా దగ్గర ఓ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకుందంట. అయితే, మొన్నటివరకు అక్కడ ఏ ఇబ్బంది లేకపోయినా.. రీసెంట్ గా ఆ అపార్ట్మెంట్ హౌసింగ్ సొసైటీ వాళ్ళు ఊహించని షాక్ ఇచ్చారట. ప్రధానంగా ఒంటరిగా ఉంటున్న నిధి అగర్వాల్ టైమ్ కాని టైమ్ లో ఫ్లాట్ కు వస్తుండటంతో పక్క ఫ్లాట్స్ వాళ్ళు ఆమె మీద కంప్లైంట్ చేశారట. అంతేకాకుండా ఒంటరిగా ఉంటున్న నిధి ఏమైనా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుందేమో అంటూ అనేక ఆరోపణలు చేశారట.
ఈ కారణంగా వెంటనే ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని నిధి అగర్వాల్ కు హౌసింగ్ సొసైటీ వాళ్ళు తేల్చి చెప్పడమే కాకుండా.. బయటకు కూడా పంపించేసినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన హీరోయిన్ నిధి.. ముంబైలో సెటిల్ అవుదామని వచ్చిన ఒంటరి అమ్మాయిల పరిస్థితి ఇలాగే ఉందని, ఇప్పుడు ఇంటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోందని చెప్పుకొచ్చింది. అలాగే సినిమా వాళ్ళు అన్నాక ఏ టైమ్ లో ఇంటికి చేరుతామో తెలియదని, అలాంటప్పుడు అర్థం చేసుకోకుండా ఇలా తమ మీద నిందలేసి ఇళ్ల నుంచి వెళ్లగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. చివరగా ఇప్పుడు నా పరిస్థితి రోడ్డున పడ్డట్లు అయిందని నిధి అగర్వాల్ వాపోయింది. ఇదిలా ఉంటే, అప్పట్లో షబానా అజ్మీ, ఆ మధ్య సన్నీలియోన్ లాంటి వాళ్లకు కూడా కెరీర్ మొదట్లో ఇలాంటి అనుభవాలే ఎదురైన విషయం తెలిసిందే. మరి వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అనే విషయం ఈ సొసైటీ ఎప్పటికి గుర్తిస్తుందో చూడాలి.