షాకింగ్.. ‘ఓం నమో వెంకటేశాయ’ టైటిల్ మారుస్తారా..?

టాలీవుడ్ లో ఈ మధ్య వివాదాలకు కొదవే లేకుండా పోతోంది. ముఖ్యంగా సినిమాల విషయంలో ఏ చిన్న అవకాశం దొరికినా ఎవ్వరూ వదిలిపెట్టడం లేదు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సెన్సేషన్ ‘వంగవీటి’ విషయంలో ఏ రేంజ్ లో వివాదాలు నడుస్తున్నాయో చూస్తున్నాం. ఓపక్క వంగవీటి లోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలనే డిమాండ్ పెరిగిపోతుంటే.. మరోపక్క ఏకంగా వంగవీటి టైటిల్ మార్చాలనే వాదన కూడా వినిపిస్తుంది. ఇక ఇప్పుడేమో టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా విషయంలో కూడా ఓ చిన్న వివాదం చెలరేగడం గమనార్హం. దానిని వివాదం అనడం కన్నా.. టైటిల్ మార్చాలనే డిమాండ్ అనడం కరెక్ట్ గా ఉంటుందేమో.
అసలు విషయంలోకి వెళితే, ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా శ్రీ వేంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడు హథీరామ్ బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో హథీరామ్ బాబా పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. అదే విధంగా అనుష్క, ప్రగ్యా జైశ్వాల్, జగపతిబాబు, విమలారామన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ను మార్చాలని సేవాలాల్ సేన డిమాండ్ చేస్తుండటం గమనార్హం. ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో తాజాగా సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు భూక్య సంజీవ్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఓం నమో వెంకటేశాయ’ టైటిల్ ను వెంటనే ‘హథీరామ్ బావాజీ’ గా మార్చాలని అన్నారు. ఇకపోతే, ఆయన ఈ విషయాన్ని దర్శకేంద్రుడి దృష్టికి కూడా తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది. మరి దీనికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు హీరో నాగార్జున కూడా ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే, ఏం జరిగినా టైటిల్ మార్చే ప్రయత్నం చేయరనే అనిపిస్తోంది. అందులోనూ ఇది పెద్ద వివాదానికి దారితీసే విషయం కూడా కాకపోవడంతో.. టైటిల్ మార్చాలనే డిమాండ్ ను పెద్దగా పట్టించుకోరనే అనిపిస్తోంది. మరి ఏమవుతుందో ముందు ముందు చూడాలి.