నాగార్జున పాచికలు ఆయన దగ్గర సాగవ్..!!

టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి పరమ భక్తుడిగా మారిపోయి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఓం నమో వెంకటేశాయ’ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ సందర్బంగా రిలీజ్ చేసిన పాటలు మనోరంజకంగా ఉంటే, ట్రైలర్ నవరస మనోహరంగా ఉంటూ మరో సుందర దృశ్యకావ్యాన్ని, ఆధ్యాత్మిక చిత్రాన్ని అందిస్తున్నట్లుగా కనిపించింది. ఇప్పటికే నాగ్ – దర్శకేంద్రుడి కాంబినేషన్లో అన్నమయ్య, శ్రీ రామదాసు, షిరిడి సాయి లాంటి భక్తిరస చిత్రాలు రాగా.. ఇప్పుడు ఈ ‘నమో వెంకటేశాయ’ లో కాస్త యాక్షన్ పాళ్ళు ఎక్కువగా కనిపిస్తుండటం విశేషం.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఎప్పటిలాగే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పిచ్చిగా ప్రేమించే భక్తుడిగా, హథీరామ్ బాబా గా నాగార్జున తన అద్వితీయమైన నటనతో కట్టిపడేశాడు. అయితే, నాగ్ ను ఇబ్బందులకు గురిచేసే విలన్లు ఉండటం, అదే టైమ్ లో భగవంతుడు కూడా నాగార్జునకు పరీక్ష పెట్టడం.. చివరకు నాగ్ తో దేవుడు కూడా కలిసిపోయి లోక సంరక్షణార్థం దుష్ట సంహారం చేయడం వంటివి కథలో కీలక అంశాలు అని ట్రైలర్ ను చూస్తుంటే అర్థమవుతుంది. ప్రధానంగా దేవుడితోనే నాగార్జున పాచికలు ఆడటం.. ‘ఇక నీ పాచికలు నా దగ్గర సాగవ్’ అంటూ దేవుడే నాగార్జునకు చెప్పడం కథలో పెద్ద ట్విస్ట్ గా కనిపిస్తోంది. ఇక నటీనటుల విషయానికి వస్తే.. వెంకటేశ్వరస్వామిగా నార్త్ నటుడు సౌరభ్ మెప్పిస్తే.. భక్తురాలిగా అనుష్క బాగానే ఆకట్టుకుంటుంది. అలాగే మిగిలిన పాత్రల్లో రావు రమేష్, సంపత్, విమలారామన్ తదితరులు బాగున్నారు. ఇక దర్శకేంద్రుడి దర్శకత్వ ప్రతిభతో పాటు ఈసారి కంప్యూటర్ గ్రాఫిక్స్ మాయాజాలం కూడా ఎక్కువే ఉండటంతో.. సినిమా కన్నుల పండుగగా వెలిగిపోతోంది. అలాగే కీరవాణి కూడా ఎప్పటిలాగే మ్యూజిక్ తో మెస్మరైజ్ చేయడంతో.. ‘ఓం నమో వెంకటేశాయ’ ఈసారి ఆధ్యాత్మిక సాగరంలో ప్రేక్షకులను లాలిస్తుందని అర్థమైపోతోంది.