atrk

‘ప్రత్యేక హోదా’ ను జనసేనకు వదిలేయమంటున్న పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుగా చెప్పినట్లుగానే నేటి సాయంత్రం కాకినాడ వేదికగా ‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’ అంటూ ఉద్వేగంగా తన వాణిని వినిపించారు. ముందుగా ‘ఏ దేశమేగినా, ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అంటూ మహాకవి గురజాడ మాటలతో ప్రసంగం ప్రారంభించిన పవన్ ఎప్పటిలాగే తనదైన స్టైల్లో స్పీచ్ ను కొనసాగించి ‘ప్రత్యేక హోదా’ యే లక్ష్యంగా మరోసారి గళమెత్తారు. ఈ సందర్బంగా ప్రసంగం ఆదిలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని, మంత్రి వెంకయ్య నాయుడిని టార్గెట్ చేసిన పవన్.. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలుగా అభివర్ణించడం విశేషం.

అనంతరం అవకాశవాదపు రాజకీయాల వలన గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకొచ్చారని అంటూ కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలను విమర్శిస్తూ ప్రజల హక్కుల కోసం పోరాటం చేయడానికి కాకినాడ వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన సుధీర్ఘ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే బీజేపీ, టీడీపీ పార్టీలను కూడా సున్నితంగా విమర్శిస్తూ నేను ఎవరికీ తొత్తును కాదని, నన్ను ఎవ్వరూ నడిపించడం లేదని అన్నారు. అలాగే నేను సినిమా హీరోను కావచ్చు గాక, కానీ కొందరు రాజకీయ నేతల్లా వేల ఎకరాలు వెనకేయలేదని, నా వెనక ప్రజలు మాత్రమే ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పవన్ గత చరిత్రను ఓసారి గుర్తుచేస్తూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన వైనం, తెలంగాణ పోరాటం, ఏపీ కష్టాలను వివరించే ప్రయత్నం చేశారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలను తీవ్రంగా తప్పుబడుతూ, తనను విమర్శించే వాళ్లపై పవన్ మండిపడ్డారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటులో పోరాడాలని, మీరు విఫలం చెందితే అప్పుడు ‘జనసేన’ పార్టీ చూసుకుంటుందని పవన్ స్పష్టం చేశారు. అలాగే మీ వల్ల కాదంటే ‘ప్రత్యేక హోదా’ ఉద్యమాన్ని జనసేనకు వదిలేయమని సీమాంధ్ర నేతలకు పవన్ సూచించారు. ఇకపోతే, నీకు వీలైతే నా ప్లేస్ లో ఉండి పోరాటం చేయమని పవన్ ను విమర్శించిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ను పవన్ ప్రస్తావిస్తూ.. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసి అందరి ఎంపీలకు ఆదర్శంగా నిలవాలని, అవంతి రాజీనామా చేస్తే తనని తిరిగి గెలిపించుకునే బాధ్యత తనదేనని, జనసేనదేనని పవన్ వ్యాఖ్యానించారు. అలాగే తానెప్పుడూ వ్యాపారాలు చేయడం పాపం అనలేదని, ఎంపీలు ఇప్పుడైనా సొంత లాభాన్ని కొంత మానుకోవాలని అన్నారు. ఈ సందర్భంలోనే పవన్ తాను ఏపీ కోసం తన అన్న, వదిన, అమ్మ, అక్క చెల్లెళ్లను వదిలి బీజేపీ, టీడీపీ లకు మద్దతు ఇచ్చానని.. ఇప్పుడు ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని సీరియస్ గా క్లాస్ ఇచ్చారు. ఇక ఈ ప్రసంగంలోనే సీమాంధ్ర బీజేపీ నేతలంతా మరో పార్టీ చూసుకోవాలని, వెంకయ్య నాయుడు ఏపీలో బీజేపీని చంపేశారని అంటూ మాట్లాడిన పవన్.. కేంద్రం ఇచ్చిన పాచిపోయిన లడ్డూలు లాంటి ప్యాకేజీని తీసుకుంటారో లేదో చంద్రబాబు ఇష్టం అని అన్నారు.
పవన్ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు :
* నేను మన హక్కుల కోసం వచ్చాను.. మీ సహకారం కావాలి
* దేశభక్తి ఉత్తరాదికే కాదు.. దక్షిణాది వారికి కూడా ఉంది. ఉత్తరాది అహంకారం మీదే నా పోరాటం
* కాంగ్రెస్ కు 150 ఏళ్ళ చరిత్ర సరే.. ఆనాటి నైతిక విలువలు ఏమయ్యాయి?
* కాంగ్రెస్ వెన్నుపోటు పొడిస్తే.. బీజేపీ పొట్టలోనే పొడిచింది
* వెంకయ్య నాయుడు పెద్దరికం పేరుతో సీమాంధ్రకు అన్యాయం చేస్తే ఊరుకోము
* నేను అనుకుంటే బీజేపీని ముప్పుతిప్పలు పెట్టగలను
* బీజేపీ వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడటం లేదు
* ఎంపీల్లారా మీకు పౌరుషం లేదా? ఒంటికి కొంచెం కారం రాసుకోండి
* మనకెవరూ లేరు మనకు మనమే సైన్యం.. మనమే జన సైన్యం
* నాకు అధికార దాహం ఉంటే.. సమైక్యాంధ్ర ఉద్యమం నేను నడిపేవాడిని
* నాకు తెలంగాణ ఇష్టం, ప్రేమ, తెలంగాణ కష్టాలను దగ్గర నుంచి చూశాను
* మీరు హోదా ఇవ్వం అని చెప్తే మేమేం చేయాలో అది చేస్తాం
* ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేద్దాం
* టీడీపీని ఒక్కటే అడుగుతున్నాను.. కేంద్రం ఇచ్చిన పాచిపోయిన లడ్డూలు తీసుకుంటారా?
* మీరు సుఖ పడండి.. కానీ ప్రజలను మాత్రం కష్టపెట్టకండి
* చంద్రబాబు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది
* భవిష్యత్ లో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇక్కడ తిరగాలంటే ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

చివరగా పవన్ సీమాంధ్ర కోసం పోరాడి మరణించిన అమరవీరులకు కర్నూలులో గాని, అమరావతిలో గాని స్మారక స్థూపం నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇకపోతే నేటి సభ ద్వారా పవన్ చెప్పదలచుకుంది ఏమిటంటే.. ‘ప్రత్యేక హోదా’ కోసం పోరాడటం మీ వల్ల కాకపోతే, ఇక మావల్ల కాదని మీరంటే.. ఆ బాధ్యతను జనసేనకు వదిలేయాలని, జనసేన పార్టీ ప్రజల ఆస్తికి ఏ విధమైన నష్టం కలగకుండా, శాంతియుతంగా రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తుందని చెప్పకనే చెప్పారు. మరి టీడీపీ ప్రభుత్వం పవన్ చెప్పినట్లు ప్రత్యేక హోదా సాధించడం మా వల్ల కాదని బహిరంగంగా ప్రకటిస్తుందో లేదో చూడాలి.

‘ప్రత్యేక హోదా’ ను జనసేనకు వదిలేయమంటున్న పవన్ కళ్యాణ్..!!
0 votes, 0.00 avg. rating (0% score)