బాహుబలి నిర్మాతలనే రూ.2 కోట్లకు బ్లాక్ మెయిల్ చేశారు

Piracy Blackmail call Baahubali Producers 

బాహుబలి ది కంక్లూజన్ ఇప్పుడు ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన విషయం తెలిసిందే. ఏకంగా కలలో కూడా ఊహించని 1500 కోట్ల రూపాయల క్లబ్ ను అందుకుంటూ ఊహకందని బెంచ్ మార్క్ ను సెట్ చేస్తోంది. ఇలాంటి టైమ్ లో ఈ ప్రతిష్టాత్మక చిత్రం పైరసీ కూడా ఆ రేంజ్ లోనే చక్కర్లు కొట్టిన విషయం తెలిసే ఉంటుంది. అయితే, ఇలాంటి సినిమాను థియేటర్లోనే చూడాలని చాలామంది ఫీలవడంతో.. కలెక్షన్స్ ఆ రేంజ్ లో వచ్చాయి. కానీ, ఇప్పుడు ఏకంగా ఒరిజినల్ హెచ్డీ డీవీడీ ప్రింట్ కు సంబంధించి ఓ పైరసీ కాపీ బయటకు రావడం కలకలం రేపుతోంది. ఇదే అనుకుంటే, ఈ పైరసీ ప్రింట్ ను తమ చేతిలో పెట్టుకుని కొందరు బాహుబలి నిర్మాతలనే ఏకంగా 2 కోట్ల రూపాయలకు బ్లాక్ మెయిల్ చేశారని తెలియడం షాకింగ్ న్యూస్ అయింది.
ఆ స్టోరీలోకి వెళితే, రీసెంట్ గా ఈ పైరసీకి పాల్పడింది తామేనని, 2 కోట్ల రూపాయలు తమకు చెల్లించకపోతే వెంటనే ఈ హెచ్డీ ప్రింట్ ను అందరికీ అందుబాటులోకి తెచ్చేస్తామని ఓ ఆన్ లైన్ పైరేట్స్ గ్రూప్ హెచ్చరించిందట. దీంతో షాక్ అయిన బాహుబలి-2 నిర్మాతలు కామ్ గా ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. ఈ క్రమంలో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పాట్నాలో ఒక క్రిమినల్ ను అతని అనుచరులను అరెస్ట్ చేసి, రోహిత్ వర్మ అనే సైబర్ నేరగాడు ఈ దారుణానానికి పాల్పడినట్లు గుర్తించారట. ఇక ఈ నిందితులను ఇప్పుడు హైదరాబాద్ కు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా, పైరసీ భూతం ఎంతలా పడగ విప్పుతున్నా బాహుబలి-2 కలెక్షన్స్ స్టడీగా ఉండటం విశేషం. మరీ ముఖ్యంగా సినిమా రిలీజై రెండు వారాలు దాటేసినా కూడా జనం థియేటర్ల వైపు పరుగులు పెడుతుండటం బాహుబలి-2 సక్సెస్ కు అద్దం పడుతోంది.