‘మిస్టర్’ కు అల్లు అరవింద్ క్లాస్

టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలివితేటల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినీ నిర్మాణాల విషయంలోనూ, ఆ సినిమాలను బిజినెస్ చేసే విషయంలోనూ ఆయన మాస్టర్ అనే అనాలి. అందుకే ఈ మెగా మాస్టర్ తాజాగా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతిన్న మెగా హీరో సినిమా ‘మిస్టర్’ కు సుదీర్ఘమైన క్లాస్ పీకారట. సినిమాకు అంటే సినిమాకు కాదండోయ్.. మిస్టర్ మూవీ నిర్మాతలకు ఓ మంచి క్లాస్ తీసుకున్నారట. ఆ స్టోరీలోకి వెళితే, వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘మిస్టర్’ ను అప్పుడే ఫ్లాప్ అని ట్రేడ్ వర్గాలు డిసైడ్ చేసేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికి ఎంతో కొంత కలెక్షన్స్ రాబట్టినా కూడా భారీ ఫ్లాప్ కింద లెక్కేయడానికి కారణం.. సినిమా కోసం భారీగా ఖర్చు చేసేయడమేనని అర్థమైపోతుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ సినిమా మార్కెట్ రేంజ్ తో పోలిస్తే ఇది చాలా పెద్ద సినిమా అని అంటున్నారు.

ఈ కారణంగా ఒకవేళ సినిమా ఖర్చు తక్కువగా ఉండి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ తోనే ‘మిస్టర్’ మూవీ కొంతలో కొంత సేఫ్ జోన్ లోకి వచ్చేదని లెక్కలు వేస్తున్నారు. తాజాగా ఈ పాయింట్ నే హైలైట్ చేస్తూ.. అదనంగా పెరిగిపోయిన క్యాస్టింగ్, భారీ లొకేషన్స్, ఇలా వీటన్నింటికీ బడ్జెట్ భారీగా పెరిగిపోయి మూవీ ఫ్లాప్ అయిందంటూ అల్లు అరవింద్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దర్శకుడు శ్రీనువైట్ల ఈ ప్రాజెక్టుపై ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నాడనే విషయం అర్థమైనా  కూడా నిర్మాతలు ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి లు సరిగ్గా పట్టించుకోలేదని అల్లు అరవింద్ ప్రస్తావించినట్లు సమాచారం. దీంతో బడ్జెట్ విషయంలో స్ట్రిక్ట్ గా లేకపోతే ఎంత గొప్ప ప్రాజెక్ట్ చేసినా చివరకు ఇలా రిజల్ట్ తేడా కొడుతుందని అల్లు అరవింద్ సీరియస్ గానే చెప్పినట్లు ఇన్నర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలని చెప్పి చివరగా అల్లు అరవింద్ క్లాస్ ముగించినట్లు ప్రచారం జరుగుతోంది.