‘రెడ్డి గారు’ కి ఫిక్స్ అయిపోయిన బాలయ్య!

Reddy Garu Balakrishnas Next
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇంతకుముందే సమరసింహా రెడ్డి, చెన్నకేశవ రెడ్డి అంటూ రెడ్డి పేర్లతో ఫ్యాక్షన్ సినిమాలు చేసి, దానికంటూ ఓ బ్రాండ్ నేమ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్లకు రెడ్డి అంటూ బాలయ్య రెడీ అయిపోతున్నారని సమాచారం. ఆ స్టోరీలోకి వెళితే, ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో బాలయ్య మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తోన్న విషయం అందరికీ తెలుసు. ఈ సినిమా తర్వాత బాలయ్య తన 102వ సినిమాగా సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ తో ఓ సినిమా చేసేందుకు రీసెంట్ గా ఓకే చెప్పారు.
అధికారికంగా కూడా ఖరారైపోయిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం రెడీ చేసిన కథతోనే డైరెక్టర్ కేఎస్ రవికుమార్ ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. అందుకే బాలయ్యకు తగినట్లుగా చిన్న చిన్న మార్పులు కూడా చేస్తుండగా.. ఇప్పుడు ఈ సినిమాకు ఏ టైటిల్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. ఇలా ఆలోచిస్తుండగానే తాజాగా.. ఈ సినిమాకు ‘రెడ్డి గారు’ అనే టైటిల్ బాగుంటుందని బాలయ్యతో సహా అందరూ ఫిక్స్ అయిపోయారట. ఈ క్రమంలో ఇప్పుడు అధికారికంగా ఈ టైటిల్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు గాని.. దాదాపుగా దీనికి ఫిక్స్ అయిపోయినట్లేనని అంటున్నారు.
అయితే, ఇప్పుడు ఈ టైటిల్ కు ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ బాగానే వస్తున్నా.. పొలిటికల్ సర్కిల్ లో మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. అసలే ఎమ్మెల్యేగా కొనసాగుతూ చాలామందికి టార్గెట్ గా మారుతున్న బాలయ్య ఇప్పుడు ఇలా ఒక సామాజిక వర్గానికి చెందిన పేరును టైటిల్ గా పెట్టుకుంటే మిగిలిన సామాజిక వర్గాల వారు హర్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య ఇంకోసారి ఆలోచించుకుని ‘రెడ్డిగారు’ కి ఓటేస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమా తర్వాత బాలయ్య ఇలాంటి కమర్షియల్ సినిమాలను వరుసగా చేస్తుండటం విచిత్రంగా ఉందని కొంతమంది ఫ్యాన్సే అంటుండటం విశేషం.