కాబోయే మామగారి సినిమాలో సమంత..!

సౌత్ స్టార్ హీరోయిన్, చెన్నై చిన్నది సమంత త్వరలోనే అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. అలాగే చైతూతో కలిసి సమంత పలు సినిమాల్లో నటించడం, ప్రేమలో పడిపోవడం, పెళ్ళికి రెడీ అయిపోవడం వంటివి ఎప్పటికీ మర్చిపోలేని విషయాలే. అంతేకాకుండా అక్కినేని ఫ్యామిలీ సినిమా ‘మనం’ లో నాగార్జునకు సమంత తల్లిగా నటించడం, ఆ ఎమోషనల్ సీన్స్ ను కూడా అంత సులువుగా మర్చిపోలేం. ఇప్పుడు ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే.. మరోసారి నాగార్జునతో కలిసి నటించడానికి సమంత రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కాబట్టి.

ఆ స్టోరీలోకి వెళితే, పెళ్లి తర్వాత సమంత సినిమాలు చేస్తుందా లేదా అనే ప్రశ్నకు చెక్ పెడుతూ.. నటించడం ఎప్పటికీ మాననని, ఈ ఏడాది ఇంకా ఎక్కువ సినిమాల్లో నటిస్తానని, క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేస్తున్నానని రీసెంట్ గా సమంత స్పష్టం చేసేసింది. అయితే, ఇప్పటివరకు అఫీషియల్ గా ఏ ప్రాజెక్టుకూ సమంత సైన్ చేయలేదు. ప్రస్తుతం అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథతో తెరకెక్కనున్న ‘మహానటి’ సినిమాలో సమంత ఓ కీలక పాత్ర చేయనుందనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టులో సమంత భాగం అవుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా సమంత కాబోయే మామగారు, కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం.

అసలు విషయం ఏమిటంటే.. ఓంకార్ డైరెక్షన్లో నాగార్జున ‘రాజుగారి గది-2’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగ్ తో పాటు ఓంకార్ తమ్ముడు అశ్విన్, ప్రవీణ్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. అలాగే హీరోయిన్ గా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సీరత్ కపూర్ ను ఓకే చేశారు. ఇక ఇప్పుడేమో ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉండటంతో స్వయంగా నాగార్జునే.. సమంతను తీసుకోమని డైరెక్టర్ కి చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే, ‘మనం’ టైమ్ లో మామూలుగా నటించిన సమంత.. ఇప్పుడు కాబోయే మామగారితో నటించినట్లు అవుతుంది. ఇక ఎలాగూ సినిమా వచ్చేటప్పటికి సమంత కోడలు అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి పీవీపీ నిర్మించనున్న ఈ ‘రాజుగారి గది-2’ సినిమా మామగారు, కోడలికి ‘మనం’ లా తీపి గుర్తులు మిగులుస్తుందేమో చూడాలి.