ఏపీలో పవన్ కళ్యాణ్.. తెలంగాణ నుంచి సంపూర్నేష్ బాబు!

ఏపీలో పవన్ కళ్యాణ్.. తెలంగాణ నుంచి సంపూర్నేష్ బాబు!

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ నిన్న తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగించిన విషయం తెలిసిందే. అలాగే ప్రత్యేక హోదా సాధన కోసం చేయబోయే పోరాటాల దశలను, కార్యాచరణను పవన్ వివరించారు. దీనిపై ప్రస్తుతం వివిధ పార్టీల రాజకీయ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు కాస్త వేడెక్కించే వాతావరణాన్ని సృష్టిస్తుండటంతో ప్రత్యేక హోదా విషయంలో పవన్ కు మద్దతుగా ముందుకురావడానికి నేతలెవరూ అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

ఇక సినిమా వాళ్ళ సంగతి అయితే ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. పవన్ కు మద్దతు ఇస్తూ జనసేన తరపున మాట్లాడితే ముందు ముందు ఏమవుతుందోనని ఇప్పటికి సైలెంట్ గానే ఉంటున్నారు. మామూలు సమయాల్లో పవన్ భజన చేసే సెలబ్రిటీలు కూడా ఇటువంటి ప్రజా, రాజకీయ పోరాటాల విషయాల్లో కనీసం తమ స్పందనను తెలియజేయడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు డేరింగ్ గా పవన్ ప్రసంగంపై తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ‘పవన్ కళ్యాణ్ గారి ఉద్యమంలో నేనూ ఒక గొంతునవుతున్నాను’ అంటూ ట్వీట్ చేయడం విశేషం.

ఈ విషయంలో ట్వీట్ రూపంలో సంపూ ఇచ్చిన సందేశం ఏమిటంటే.. ‘నేను తెలంగాణలో పుట్టాను, నా సోదర తెలుగు రాష్ట్ర ప్రజలు ఇంత కష్టంలో ఉన్నారని, వారి గుండెల్లో ఇంత ఆగ్రహం ఉందని పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ద్వారా తెలిసి గుండె బరువెక్కింది. రాష్ట్రాలు వేరైనా కష్టం వచ్చినప్పుడు అందరం ఒక్కటే, సీమాంధ్రుల బాధని కేంద్ర ప్రభుత్వం దగ్గరకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ తెలుగు వాడికి ఉంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకి. వారు కొంటున్న టికెట్ డబ్బుతోనే మనం బ్రతుకుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఉద్యమంలో నేనూ ఒక గొంతునవుతున్నాను. దీనివల్ల ఏ ఉపయోగం జరగకపోవచ్చు, కానీ ఏమో నా వల్ల మరొకరు ధైర్యంగా ముందుకు రావచ్చుగా’ అంటూ సంపూ తనదైన స్టైల్లో జైహింద్, సదా మీ ప్రేమకు బానిస మీ సంపూర్నేష్ బాబు అని తన ప్రేమను తెలియజేశాడు. దీనికి నెటిజన్ల నుంచి, జనసేన అభిమానుల నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. ఇదే సమయంలో సంపూ ఈ గొడవల్లోకి దిగొద్దు.. తొక్కేస్తారు జాగ్రత్త అని సూచనలు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దానికి సంపూ సమాధానం ఇస్తూ.. నేను స్వర్ణకారుడ్ని, ఇక్కడ తొక్కితే మా ఊర్లో నాకు పని రెడీగా ఉంది సార్ అంటూ చెప్పుకోవడం సంపూ డేరింగ్ అండ్ డాషింగ్ ను సూచిస్తోంది. ఏదిఏమైనా పవన్ ఏపీలో ఉద్యమానికి ఊపిరి పోస్తే.. నేను తెలంగాణలో పుట్టానని చెబుతూ సంపూ తెలంగాణ నుంచి నేను ఒక గొంతునవుతున్నానని చెప్పడం చిన్న విషయమే అయినా మంచి పరిణామానికి ఇదో ఉడతా భక్తి సాయం అనుకోవచ్చు.

ఏపీలో పవన్ కళ్యాణ్.. తెలంగాణ నుంచి సంపూర్నేష్ బాబు!
0 votes, 0.00 avg. rating (0% score)