క్రెడిట్ తో పాటు వర్మ డబ్బులు కూడా ఎగ్గొట్టాడట!

స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వోడ్కా తాగినంత సులువుగా వివాదాల్లో చిక్కుకుంటారనే విషయం అందరికీ తెలుసు. ఆ వివాదాలకు భయపడటం అటుంచి.. తన సినిమాల పబ్లిసిటీకి ఆ వివాదాలను వాడుకుంటూ, వ్యంగ్యంగా స్పందిస్తూ ఎంటర్టైన్ అవడానికి వర్మ ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఈ క్రమంలో ఇదంతా వర్మ కావాలనే ప్రీ ప్లాన్డ్ గా చేస్తాడా? లేక మూర్ఖత్వంతో అలా వివాదాల్లో చిక్కుకుంటాడా? అనే డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే.. తాజాగా వర్మ మరో సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు కాబట్టి. అది కూడా వర్మ మోసం చేశాడనే ఆరోపణపై కావడం విశేషం.

అసలు విషయంలోకి వెళితే, రిలీజ్ కు రెడీ అయిన రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘సర్కార్-3’ కథ రాసింది ఆయన కాదంట. ముంబైకి చెందిన రైటర్ నీలేష్ గిర్కార్ అనే ఆయన ‘సర్కార్-3’ కథ రాశారట. ఇక ఇప్పుడు వర్మ తన దగ్గర కథ తీసుకుని, టైటిల్స్ లో క్రెడిట్ ఇవ్వడం లేదని, అలాగే డబ్బులు కూడా ఎగ్గొట్టాడని నీలేష్ గిర్కార్ ఆరోపిస్తుండటం హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా ఈ విషయంపై నీలేష్ తాజాగా బాంబే హైకోర్టును ఆశ్రయించడం, వెంటనే కోర్టు కూడా అతని విషయంలో సానుకూలంగా స్పందించడం హైలైట్ న్యూస్ అయింది. ఈ క్రమంలో నీలేష్ పిటిషన్ ను పరిశీలించిన అనంతరం కోర్టు.. అతడికి వర్మ ‘సర్కార్-3’ స్పెషల్ స్క్రీనింగ్ వేసి అభ్యంతరాలపై స్పష్టత ఇవ్వాలని, అలాగే ఈ వివాదం సెటిల్మెంట్ కోసం కోర్టులో రూ. 6.2 లక్షలు డిపాజిట్ చెయ్యాలని ఆదేశించడం గమనార్హం. దీంతో ఇప్పుడు వర్మ ఆ ఏర్పాట్లలో ఉన్నాడని తెలుస్తోంది. మరి ఈ వివాదం నుంచి వర్మ మామూలుగానే బయటపడతాడా? లేక ఈ వివాదాన్ని ఏప్రిల్ 7న రిలీజ్ అవుతున్న ‘సర్కార్-3’ సినిమా కోసం ప్రమోషన్స్ గా వాడేసుకుంటాడా? అనేది చూడాలి.