‘శతమానం భవతి’ లో స్టార్ హీరోలందరూ కనిపిస్తారట!

టాలీవుడ్ కు ఈ సంక్రాంతి ప్రతిష్టాత్మకంగా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ తో పోటీగా బాలయ్య వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రిలీజ్ అవుతుండటం విశేషంగా నిలుస్తోంది. ఇదే టైమ్ లో ధైర్యంగా, మొండిగా రిలీజ్ అవుతున్న ‘శతమానం భవతి’ సినిమా సంక్రాంతి పండుగకు అద్దం పడుతోంది. టాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన ‘శతమానం భవతి’ సినిమాపై ఉన్న నమ్మకంతో సంక్రాంతి బరిలోనే దించుతున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ తో దాదాపు మూడేళ్ళ నుంచి దిల్ రాజు ట్రావెల్ అవుతుండటంతో.. అవుట్ ఫుట్ కూడా బాగా రావడంతో.. మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారట. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను ఇప్పటినుంచే ఆకట్టుకోవడానికి మూవీలో బోలెడన్ని ఆకర్షణలు ఉన్నాయని మేకర్స్ చెప్పుకొస్తున్నారు.

అందులో భాగంగా తాజాగా బయటకొచ్చిన అప్ డేట్ ఒకటి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. అదేంటంటే.. ‘శతమానం భవతి’ లో టాలీవుడ్ స్టార్ హీరోలందరూ కనిపిస్తారట. అదేంటి.. ఈ సినిమాలో స్టార్ హీరోలందరూ కొంపతీసి క్యామియో రోల్స్ ఏమైనా చేశారా? అని ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవద్దు. అసలు విషయం ఏమిటంటే.. మన స్టార్ హీరోల వేర్వేరు సినిమాల్లోని సన్నివేశాలను అతికించి, సినిమా అంతా కొనసాగేలా ‘శతమానం భవతి’ కోసం ఓ స్పెషల్ ట్రాక్ ను తీర్చిదిద్దారట. ఈ సన్నివేశాలు సినిమాలో ఒకరితో ఒకరు సంభాషిస్తున్నట్లుగా ఉంటాయట. దీనికోసం దాదాపు మన స్టార్ హీరోలందరినీ కవర్ చేసేస్తూ సీన్స్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. దీంతో ఇదే ఇప్పుడు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుందని సమాచారం. ఇదిలా ఉంటే, టాలీవుడ్ స్టార్ హీరోలందరితో దిల్ రాజు కి మంచి సంబంధాలే ఉండటంతో.. వాళ్లందరినీ తన ‘శతమానం భవతి’ కోసం ఇలా వాడేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలుస్తోంది. మరి మన స్టార్ హీరోల స్పెషల్ అట్రాక్షన్ సినిమాకు ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.