విడాకులకు నో చెప్పిన స్టార్ హీరో.. ఫ్యాన్స్ హ్యాపీ

కన్నడ స్టార్ హీరో సుదీప్ ఈగ, బాహుబలి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ స్టార్ హీరో కొన్ని నెలల క్రితం తన భార్య ప్రియా రాధాకృష్ణన్ తో కలిసి ఉండలేకపోతున్నానని, ఆమె నుంచి తనకు విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కడంతో.. అప్పట్లో అందరూ షాక్ అయ్యారు. అంతేకాకుండా లీగల్ గా విడిపోవడానికి తన భార్యకు పెద్ద ఎత్తున భరణం ఇచ్చేందుకు సుదీప్ సిద్దపడటం అప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే, ఇప్పుడేమో ఈ విడాకుల కథ కొత్త మలుపు తీసుకుంది.

ఆ స్టోరీలోకి వెళితే, 2001 లో సుదీప్ – ప్రియ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసే ఉంటుంది. వీరిద్దరికీ ఓ పాప కూడా ఉంది. అయితే, వ్యక్తిగత కారణాలరీత్యా వీరిద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకోవడంతో.. గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. కానీ, విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ సుదీప్ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రీసెంట్ గా తనకు ఒక రెండు నెలలు సమయం కావాలని కూడా సుదీప్ తన తరపు న్యాయవాది రూపంలో న్యాయస్థానాన్ని కోరడంతో.. కేసు విచారణను కోర్టు ఈ మార్చి 9వ తేదీకి వాయిదా వేసిందట.

అయితే ఈలోపు ఏం జరిగిందో ఏమో, విడాకుల విషయంలో పునరాలోచన చేసుకున్నాడో ఏమో గాని తిరిగి తన భార్యతో కలిసి ఉండాలని సుదీప్ నిశ్చయించుకున్నాడు. దీంతో సుదీప్ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయని తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు సుదీప్ – ప్రియ ఇద్దరూ కూడా తమ మధ్య విభేదాలు మర్చిపోయి కలిసుండాలని నిర్ణయం తీసుకోవడంతో.. ఇరు కుటుంబాలు హర్షం వ్యక్తం చేసినట్లు కన్నడ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అలాగే సుదీప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయన ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారని, సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా, సుదీప్ – ప్రియ లు విడిపోవాలని నిర్ణయించుకున్నాక మళ్ళీ కలిసుండాలని నిర్ణయం తీసుకోవడం విశేషమే.