బాలయ్యకు నైజాంలో థియేటర్లు లేవా..?

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ మెగా, నందమూరి సినిమాలతోనే వచ్చేయడం చూస్తున్నాం. ఇంకొన్ని గంటల్లోనే మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ గా థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అయిపోతే.. ఆ వెనకాలే నటసింహం నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ గా గర్జించడానికి వచ్చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం థియేటర్ల వద్ద పండుగ వాతావరణం సందడి సందడిగా కనిపిస్తోంది. అయితే, ఇప్పుడు ఈ సందడిలోనే ఇన్నర్ గా వెళితే, థియేటర్ల కేటాయింపు విషయంలో ఈ రెండు భారీ సినిమాల మధ్య సమస్యలు తలెత్తే పరిస్థితి కనిపిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యంగా రేసులో ముందుగా వస్తోన్న చిరు ‘ఖైదీ నంబర్ 150’ కే మెజారిటీ థియేటర్స్ అప్పగించి.. బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కి అన్యాయం చేస్తున్నారని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ స్టోరీలోకి వెళితే, రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 90 శాతం థియేటర్లలో ముందుగా వస్తోన్న చిరు ‘ఖైదీ నంబర్ 150’ ని నింపేస్తున్నారట. దాంతో తర్వాత రోజు ఆయా థియేటర్లలో ఎంత మేరకు చిరంజీవి సినిమాను తీసేసి బాలయ్య సినిమాను వేస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో బాలయ్య సినిమాకు ఇవ్వాల్సిన థియేటర్ల లెక్కపై ఇంకా తర్జన భర్జనలు నడుస్తున్నాయని వార్తలు రావడం నందమూరి ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ విషయంలో ఏపీలోని చాలా ఏరియాల్లో ఇబ్బందేమీ లేదని తెలుస్తోంది.
కానీ నైజాం ఏరియాలో మాత్రం బాలయ్య శాతకర్ణికి కొంత మేర థియేటర్ల సమస్య ఎదురవుతుందట. ఈ క్రమంలో ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఇంకా బాలయ్య సినిమా థియేటర్లు ఖరారు కాలేదనే టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా చిరు ఖైదీ సినిమా టాక్ ను బట్టి బాలయ్య శాతకర్ణికి థియేటర్లు ఖరారు చేసేలా చర్చలు నడుస్తున్నాయని సమాచారం. ఈ విధంగా సంక్రాంతి మెగా, నందమూరి సినిమాల క్రేజ్ ను బాక్సాఫీస్ వద్ద క్యాష్ చేసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఇప్పుడు బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ బుకింగ్స్ ఇంకా అన్ని థియేటర్స్ లోనూ ఓపెన్ చేయలేదని అంటున్నారు. దీంతో ఇప్పుడు శాతకర్ణికి అనుకున్న స్థాయిలో థియేటర్స్ దక్కడం లేదని, బాలయ్యకు నైజాంలో కావాల్సినన్ని థియేటర్లు లేవా అని శాతకర్ణి టీమ్ తో పాటు ఫ్యాన్స్ లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో రేపైనా క్లారిటీ వస్తుందో లేదో చూడాలి.