త్రివిక్రమ్ మళ్ళీ ప్రయోగం.. బుద్ధుడిలా పవన్..? 

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొదట ‘దేవుడే దిగివచ్చినా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తే.. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ బాబు, పరదేశి ప్రయాణం అంటూ రకరకాల టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇదే సమయంలో సినిమాకు సంబంధించి కొన్ని అప్డేట్స్ కూడా సినీ సర్కిల్ లో విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడేమో ఒక షాకింగ్ అప్డేట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ కు తెర తీసింది.

ఆ స్టోరీలోకి వెళితే, సినిమాలతో కొంతైనా మంచి చెప్పాలని ప్రయత్నించే త్రివిక్రమ్.. తన సినిమాల్లోని పాత్రలను ప్రభావవంతంగా తీర్చిదిద్దడంలో ఎప్పుడూ ముందుంటాడని చెప్పొచ్చు. ఈ తరహాలోనే ఇప్పుడు పవన్ పాత్రను కూడా సరికొత్తగా, పవర్ ఫుల్ గా రూపొందిస్తున్నాడని సమాచారం. అది కూడా గతంలో తన ‘ఖలేజా’ సినిమాలో మహేష్ ను చూపించిన విధంగా ఇప్పుడు పవన్ ను చూపించడానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడని తెలియడం షాకింగ్ న్యూస్ అవుతుంది. ఇంతకూ మేటర్ ఏంటంటే.. ఖలేజా సినిమాలో మహేష్ పై త్రివిక్రమ్ ఓ ప్రయోగం కింద చేస్తూ, హీరోను ఓ దేవుడిగా చూపించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.
అయితే, ఆ పాత్రను అలా సరికొత్తగా డిజైన్ చేయడం బాగానే ఉన్నా.. మొత్తంగా కొన్ని తప్పులు దొర్లడంతో ‘ఖలేజా’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అందుకే ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. లేటెస్ట్ మూవీలో పవన్ పాత్రను కూడా త్రివిక్రమ్ అదే తరహాలో డిజైన్ చేస్తున్నాడట. అంటే, పవన్ పాత్రను దేవుడైన గౌతమ బుద్ధుడి భావాలతో రాశాడని టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా పవన్ పాత్ర బుద్దుడిని ఆదర్శంగా తీసుకున్నట్లు ఉంటుందని, పవన్ మాటల్లో దివ్యత్వం, శాంతి లాంటి అంశాలు ఉంటాయని ఇన్నర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఉంటూనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పవన్ అదరగొట్టేస్తాడని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు గాని, త్రివిక్రమ్ మళ్ళీ ఇలా ప్రయోగం అంటే మాత్రం షాకింగ్ గా అనిపిస్తోంది.