కోర్టు మెట్లెక్కిన స్టార్ కమెడియన్లు

vadivelu singamuthu present madras high court land issue

కోలీవుడ్ లో సీనియర్ కమెడియన్లుగా మంచి పేరునే సంపాదించుకున్న వడివేలు, సింగముత్తు లు తాజాగా కోర్టు మెట్లు ఎక్కడం హాట్ న్యూస్ అయింది. అందులోనూ ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న వీళ్ళిద్దరూ ఓ స్థలం కొనుగోలు వ్యవహారంలో శతృవులుగా మారి ఒకరినొకరు విమర్శించుకోవడం.. అక్కడితో ఆగకుండా కోర్టుకు వెళ్లడం.. అలా చాలాకాలంగా చెన్నై హైకోర్టులో విచారణలో ఉన్న వీరిద్దరి కేసు తాజాగా తెరపైకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు విషయంలోకి వెళితే, నటుడు వడివేలుతో సింగముత్తు సిటీకి దగ్గరలో తాంబరం సమీపంలో కొంత స్థలాన్ని కొనిపించారట. అయితే, ఆ స్థలాన్ని నకిలీ దస్తావేజులతో కొనిపించినట్లు తర్వాత తెలియడంతో.. సింగముత్తు తనను మోసం చేశాడని వడివేలు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఈ కేసు చాలాకాలంగా హైకోర్టులో విచారణలో ఉండగా.. ఈ నెల 7న నటులు వడివేలు, సింగముత్తు లు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారట. కానీ, ఈ స్టార్ కమెడియన్లు 7వ తేదీన గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన న్యాయమూర్తి ఈసారి 20వ తేదీన కోర్టుకు హాజరుకాని పక్షంలో వడివేలు, సింగముత్తు లపై అరెస్ట్ వారీ జారీ చేయనున్నట్లు హెచ్చరించారట. దీంతో తాజాగా వడివేలు, సింగముత్తు ఇద్దరూ కూడా హైకోర్టులో హాజరైనట్టు కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఇదిలా ఉంటే, ఆ స్థలం గొడవ వ్యవహారంలో ఈ కమెడియన్లు ఇద్దరూ చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ, అలాంటిదేమీ జరగలేదని, దాంతో న్యాయమూర్తి కేసు విచారణను వాయిదా వేశారని సమాచారం. మరి ఈ కమెడియన్స్ చివరకు ఎలా కాంప్రమైజ్ అవుతారో చూడాలి.