నిజమే.. మెగా ప్రిన్స్ తో సైన్స్ ఫిక్షన్ 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ లోనే ముకుంద, కంచె లాంటి వైవిధ్యమైన సినిమాలు చేసి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత లోఫర్, మిస్టర్ అంటూ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి పూర్తిగా డీలా పడిపోయాడు. అందుకే ఇప్పుడు క్యూట్ లవ్ స్టోరీగా శేఖర్ కమ్ములతో ‘ఫిదా’ చేస్తూనే.. మరో వైవిధ్యమైన సినిమాకు రంగం సిధ్దం చేశాడు. ఆ స్టోరీలోకి వెళితే, ఈ ఏడాది ఆరంభంలోనే రానాతో ‘ఘాజి’ లాంటి క్రేజీ సినిమాను తీసి దర్శకుడిగా తొలి సినిమాతోనే నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డితో సినిమా చేసేందుకు వరుణ్ తేజ్ ఓకే చెప్పాడని ఆ మధ్య వార్తలు వినిపించిన విషయం తెలిసే ఉంటుంది. రెండో సినిమాకు కూడా ఓ డిఫరెంట్ స్టోరీనే ఎంచుకుని వరుణ్ తేజ్ ను సంకల్ప్ రెడ్డి మెప్పించాడని అప్పుడే చెప్పుకున్నాం. ఇప్పుడది నిజమవ్వడమే కాకుండా.. ఆ స్టోరీ ఓ సైన్స్ ఫిక్షన్ అని తెలియడం విశేషం.

అంతేకాదండోయ్.. రెగ్యులర్ కథాంశంగా కాకుండా ఘాజి తరహాలోనే తన స్టైల్లో గ్రాఫిక్స్ ఆధారంగానే ఈ సినిమాను కూడా తెరకెక్కించాలని సంకల్ప్ రెడ్డి ఫిక్స్ అయిపోయాడట. ఈ మేరకు సైన్స్ ఫిక్షన్ కథతో పాటు దీనికి గ్రాఫిక్స్ చాలానే అవసరమవుతాయని కూడా ముందుగానే చెప్పేశాడట. అలాగే తాను అనుకున్నది అనుకున్నట్లే రావాలంటే.. ఈ సినిమాకు సంబంధించి ఖర్చు విషయంలోనూ, టైమ్ విషయంలోనూ ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదని ఇప్పటికే అనుమతి కూడా తీసేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు చాలానే టైమ్ పట్టేలా కనిపిస్తోంది. ఈలోపు వరుణ్ తేజ్ కూడా ఫిదా సినిమాను పూర్తి చేసి, నూతన దర్శకుడు వెంకీ అట్లూరితో అనుకున్న ఓ సినిమాను కూడా దాదాపుగా పూర్తి చేసేస్తాడని సమాచారం. ఇదిలా ఉంటే, ఇప్పుడు వరుణ్ తేజ్ మార్కెట్ దృష్ట్యా గ్రాఫిక్స్ తో భారీ బడ్జెట్ లో ఈ సైన్స్ ఫిక్షన్ రిస్క్ ఏమో అనే అనుమానం చాలామందికి కలుగుతోంది. అయితే, గొప్ప కథాకథనాలు ఉంటే, సినిమాకు ఎల్లలు లేవని ఇప్పటికే బాహుబలి, ఘాజి, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు ప్రూవ్ చేసిన నేపథ్యంలో ఇది ఇప్పుడు పెద్ద రిస్క్ కాదనే చెప్పొచ్చు.