అలీ.. ఇది కామెడీనా? క‌న్ఫ్యూజ‌నా?

టాలీవుడ్‌లో టాప్‌ క‌మెడియ‌న్ గా వెండితెర‌పై న‌వ్వులు పూయించే అలీ రాజ‌కీయ తెర‌పై కూడా అదే స్థాయిలో కామెడీకి తెర‌లేప‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీస్తోంది. అలీ, వైసీపీ నేత జ‌గ‌న్‌తో క‌లిసి క‌నిపించిన ఓ ఫొటో తో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో అస‌లు ర‌చ్చ మొద‌లైంది. అలీ త్వ‌ర‌లో రాజ‌కీయ‌కీయ అరంగేట్రం చేయ‌బోతున్నాడంటూ వ‌రుస క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి. వీటిపై స్పందించని అలీ ఇటీవ‌ల ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును క‌ల‌వ‌డం, ఆ త‌రువాత ప‌వ‌న్‌ను విజ‌య‌వాడ‌లోని ఆయ‌న స్వ‌గృహంలో క‌లిసి మంత‌నాలు చేయ‌డం తిరిగి జ‌గ‌న్‌తో స‌మావేశం కావ‌డం చూస్తుంటే అలీ రాజ‌కీయాన్ని కామెడీ చేస్తూ క‌న్ఫ్యూజ్ చేస్తున్నాడా? అనే అనుమానాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

త‌న చిర‌కాల మిత్రుడు జ‌న‌సేనాని ని కాద‌ని అలీ జ‌గ‌న్ పార్టీలో చేర‌బోతున్నాడ‌ని, ఈ నెల 9న ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని, రాజ‌మండ్రి నుంచి పోటీకి దిగే అవ‌కాశాలు కూడా వున్నాయంటూ ప్ర‌చారం జ‌రుగుతున్న‌వేళ అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తూ అలీ ప‌వ‌న్‌తో భేటీ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారానికి భిన్నంగా ఆదివారం అలీ విజ‌య‌వాడ‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డం ప‌లువురిని షాక్‌కు గురి చేసింది. ఇది ఇక్క‌డితో ఆగితే బాగుండేది. త‌ర‌వాత కూడా త‌న‌పై వ‌స్తున్న ఊహాగానాల గురించి అలీ మాట మాత్ర‌మైన స్పందించ‌క‌పోవ‌డంతో కావాల‌నే అలీ కామెడీ చేస్తూ మీడియాతో పాటు ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల్నిక‌న్ఫ్యూజ్ చేస్తున్నాడ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు త‌మ‌దైన శైలిలో చెబుతున్నారు.