ఎఫ్‌3` రెడీ అవుతోంద‌న్న వెంకీ

గ‌తేడాది సంక్రాంతికి వ‌చ్చి వినోదాలు పంచిన చిత్రం `ఎఫ్‌2`. 2019లో నిర్మాత‌కి అత్య‌ధిక శాతం లాభాలు తెచ్చిపెట్టిన చిత్రం కూడా ఇదే. దీన్నొక ఫ్రాంచైజీలాగా చేయాల‌నే ఆలోచ‌న‌లో నిర్మాత దిల్‌రాజు ఉన్నారు. బాలీవుడ్‌లో హౌస్‌ఫుల్‌, రేస్ సినిమాల్లాగా నాలుగైదు సీక్వెల్స్ చేయాల‌నేది దిల్‌రాజు ఆలోచ‌న‌. క‌థానాయ‌కుడు వెంక‌టేష్ కూడా ఈ సినిమా విష‌యంలో అదే ర‌క‌మైన ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. తాజాగా ఓ ఆంగ్ల ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెంకీ మ‌రోమారు ఇదే విష‌యాన్ని చెప్పారు. `ఎఫ్‌3`కి క‌థ సిద్ధ‌మ‌వుతోంద‌ని, అది త్వ‌ర‌లోనే ఉంటుంద‌ని తెలిపారు.

వెంకీ మాట‌ల్నిబ‌ట్టి అనిల్ రావిపూడి త‌దుప‌రి చిత్రం `ఎఫ్‌3`నే ఉంటుందేమో అనే చ‌ర్చ ఊపందుకుంది. `సరిలేరు నీకెవ్వ‌రూ` చిత్రంతో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి, ఈ చిత్రం త‌ర్వాత రామ్‌తో ఓ సినిమా చేస్తార‌ని ప్ర‌చారం సాగింది. త్వ‌ర‌లోనే `స‌రిలేరు..` ప్ర‌మోష‌న్స్ కోసం మీడియా ముందుకు రానున్న అనిల్ కొత్త చిత్రం వివ‌రాల్ని ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి. `ఎఫ్‌3` చేస్తే, అందులో ముగ్గురు హీరోలుంటార‌ని ఇదివ‌ర‌కే అనిల్ స్ప‌ష్టం చేశాడు. మ‌రి రామ్‌ని క‌లిపే `ఎఫ్‌3` చేస్తారా లేక‌, ఆయ‌న‌తో మ‌రో సినిమా చేశాక… `ఎఫ్3`వైపు వ‌స్తాడా అనేది చూడాలి.