రాజకీయాల్లోకి రాజమౌళి..

రాజ‌మౌళి ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా రంగానికి మాత్ర‌మే కావాల్సిన వాడు. కానీ ఇప్పుడు రాజ‌కీయాల‌కు కూడా కావాల్సిన వాడైపోయాడు. అంద‌రి వాడు అని చిరంజీవికి టైటిల్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ టైటిల్ కు ప‌క్కా న్యాయం చేస్తున్న‌ది మాత్రం ద‌ర్శ‌క ధీరుడే. ఇప్పుడు ఈయ‌న క్రేజ్ గురించి మాట‌ల్లో చెప్ప‌డం సాధ్యం కాదు. బాహుబ‌లి ఎఫెక్ట్ తో రాజ‌మౌళి రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. దాంతో అవార్డులు.. రికార్డుల‌తో పాటు రాజ‌కీయాలు కూడా రాజ‌మౌళి చెంత చేరుతున్నాయి. తాజాగా ఈయ‌న అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణంలో త‌న‌వంతు పాత్ర పోషిస్తున్నారు. ఏపీ సిఎం చంద్ర‌బాబుతో దీని గురించే మీటింగ్ కు కూడా వెళ్లొచ్చాడు రాజ‌మౌళి. అక్క‌డే త‌న‌కు తోచిన స‌ల‌హాలు ఇచ్చి వ‌చ్చాడు. మ‌రోవైపు సినిమా రంగంలోనూ రాజ‌మౌళి స‌ల‌హాలు చాలా కీల‌కంగా మారాయి.

చిరంజీవి త‌న 151వ సినిమా.. డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా న‌ర‌సింహారెడ్డి కోసం జ‌క్క‌న్న స‌ల‌హాలు తీసుకుంటున్నాడు. తనే కాదు.. త‌న ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డికి కూడా స‌ల‌హాలు ఇప్పిస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో చంద్ర‌బాబుతో మీటింగ్ చూస్తుంటే రాజ‌మౌళి రేంజ్ ఊహించుకుంటేనే మ‌రోలా ఉంది. దీనికి జ‌క్క‌న్న కూడా త‌న‌వంతు సాయం కాద‌న‌కుండా చేస్తున్నాడు. అయితే దీని వెన‌క టిడిపి మ‌రో ప్లాన్ కూడా సిద్ధం చేస్తుంది. ఎలాగూ రాజ‌మౌళి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పోటీ చేయ‌డు. అందుకే ఈయ‌న్ని నేరుగా రాజ్య‌స‌భ‌కు పంపే ఏర్పాటు చేస్తుంద‌ని తెలుస్తోంది. అన్నీ కుదిర్తే టిడిపి నుంచి ఎంపిగా రాజ‌మౌళిని చూడొచ్చనే వార్త‌లు కూడా ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే సినిమా త‌ప్ప మ‌రో ధ్యాసే లేని రాజ‌మౌళి దీనికి ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలిక‌..!