రైతు రుణ‌ మాఫీలో మెగా ఆద‌ర్శం

ఊరిని ద‌త్తత తీసుకోవాల‌ని `శ్రీ‌మంతుడు` ఇచ్చిన సూచ‌న ఆద‌ర్శ‌మైంది. ఆ ఫార్ములా కొంత‌వ‌ర‌కూ వ‌ర్క‌వుటైంది. సినీ-రాజ‌కీయ‌ ప్ర‌ముఖుల్లో కొంద‌రు ఊళ్ల‌ను ద‌త్త‌త తీసుకునేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. దానివ‌ల్ల కొన్నిచోట్ల అభివృద్ధి కూడా జ‌రిగింది. జ‌నంతో స్టార్లు మ‌మైక‌మై వారి స‌మ‌స్య‌ల్ని తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం పాల‌నాధికారం మారింది. ఏ ప్ర‌భుత్వాలు త‌మ‌కు మేలు చేస్తాయో వాటిని ఎన్నుకుని ప్ర‌జ‌లు గ‌త ప్ర‌భుత్వాల‌కు గుణ‌పాఠం చెప్పారు. అయితే దేశ‌వ్యాప్తంగా రైతుల స‌మ‌స్య‌ల‌పై విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతున్న ఈ త‌రుణంలో వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఏం చేస్తే బావుంటుంది?  రైతుల కోణంలో ఆలోచిస్తే వాళ్ల కోసం ఏం చేయాలి? అన్న చ‌ర్చ యువ‌త‌రంలో సాగుతోంది.

ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ మెగాస్టార్ అద్భుత‌మైన ఐడియానే ఇచ్చారు. ఆయ‌న ఏకంగా 2,100 మంది రైతుల్ని ద‌త్త‌త తీసుకుని ఏకంగా వారు చెల్లించాల్సిన వ్య‌వ‌సాయ రుణాల్ని త‌నే చెల్లించేశారు. అది కూడా బీహార్ లాంటి చోట పేద‌రైతుల్ని ఆదుకునేందుకు ఈ చ‌ర్య‌కు పూనుకుని శ‌భాష్ అనిపించారు. అయితే రైతులు లోన్లు తీసుకుని అప్పుల్లో కూరుకుపోయిన‌ది కేవ‌లం బీహార్ లో మాత్ర‌మేనా? అంటే అది అన్నిచోట్లా ఉన్న స‌మ‌స్య‌నే.

రైతాంగం క‌లిసి రావ‌డం లేదు. చేనుకు చీడ‌ల్ని నివారించే పురుగుమందు తాగి ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే ధైన్యం చాలా చోట్లా ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పేద రైతులు ఆశించిన దిగుబ‌డిని సాధించ‌లేక‌.. చేసిన అప్పులు తీర్చ‌లేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. దీనిని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వాలు ఆశించిన స్థాయిలో సాయం చేయ‌లేక‌పోతున్నాయి. ఇటు ఏపీలో వైయ‌స్ జ‌గ‌న్.. అటు తెలంగాణ‌లో కేసీఆర్ రైతు ప‌క్ష‌పాతులుగా ప‌నిచేస్తామ‌ని హామీలు ఇవ్వ‌డం కొంత‌లో కొంత ఊర‌ట‌. అయితే ఇది కేవ‌లం ప్ర‌భుత్వాల ప‌రిధిలో తీరే స‌మ‌స్య‌నా? అంటే వీలున్నంత మేర‌కు మ‌న పారిశ్రామిక వేత్త‌లు.. నాయ‌కులు.. ఇత‌ర‌త్రా రంగాల‌కు సంబంధించిన‌ సెల‌బ్రిటీలు.. స్టార్ హీరోలు కూడా బాధ్య‌త‌లు తీసుకోవాల‌నేది యువ‌త‌రం అభిప్రాయం. మ‌రి బాలీవుడ్ మెగాస్టార్ త‌ర‌హాలోనే మ‌న స్టార్లు.. ఇత‌ర‌త్రా ప్ర‌ముఖులు స్పందిస్తారా?  రైతు రుణ మాఫీల‌కు అంతో ఇంతో సాయం చేస్తారా? అన్న‌ది చూడాలి. పేద త‌ర‌గ‌తి రైతుల‌కు చిన్న‌పాటి రుణ మాఫీ(రూ.10వేలు-రూ.30వేలు లోపే)లు కూడా పెద్ద రిలీఫ్ అన్న‌ది గుర్తెరిగితే మ‌న సెల‌బ్రిటీల‌కు అదేమంత క‌ష్ట‌సాధ్య‌మైన ప‌నేం కాదు. పేద‌రికంతో కునారిల్లుతున్న రైతాంగానికి ఈ సాయం అవ‌స‌రం.