హాట్‌ స్టోరి: మెగా ద‌శావ‌తారాలు

Last Updated on by

ఓన్లీ మెగా ఫ్యామిలీ.. ద‌స్‌కా ధ‌మాకా!! ఒక్క మెగా ఫ్యామిలీ నుంచి 10 మంది హీరోలు ఇప్పుడు. ఇది రేర్ ఫీట్.. అరుదైన‌ రికార్డ్ అనే చెప్పాలి. వేరే ఏ ఇండ‌స్ట్రీలోనూ ఒకే ఒక్క ఫ్యామిలీ నుంచి అంత మంది హీరోల్ని చూడ‌లేం అంటే అతిశ‌యోక్తి కాదు. మెగాస్టార్ చిరంజీవి అనే వ‌ట‌వృక్షం నీడ‌లో ఇంత‌మంది హీరోలు త‌మ ఉనికిని చాటుకుంటున్నారు. కేవ‌లం `మెగా` అన్న కార్డ్ ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌నో చెప్పేందుకు ఈ లిస్ట్ చాలు. మెగా అన్న కార్డ్‌తోనే ఈ హీరోలు త‌మ ప్రాప‌కం సాగించ‌డం లేదు. ఎవ‌రికి వారు ఇండివిడ్యువ‌ల్‌గా ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుని స్వ‌యంకృషితో ఎదిగే ప్ర‌య‌త్నం చేయ‌డం ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్.

మెగాస్టార్ చిరంజీవి త‌న త‌రంలో ఇండ‌స్ట్రీ నంబ‌ర్ 1 హీరోగా స‌త్తా చాటారు. ఓ ర‌కంగా టాలీవుడ్ 85 ఏళ్ల చ‌రిత్ర‌లో మెగాస్టార్ ఓ సంచ‌ల‌నం. త‌న‌కంటూ ఓ స్టైల్, డ్యాన్సింగ్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని అత్యున్న‌త శిఖ‌రాల‌కు ఎదిగారు. స‌మ‌కాలీన హీరోల‌తో పోలిస్తే అత్యుత్త‌మ‌మైన క్రేజుతో వెలిగిపోయిన క‌మ‌ర్షియ‌ల్ హీరో మెగాస్టార్. దేశంలోనే ఖాన్‌ల‌కు ధీటుగా ఆరోజుల్లోనే కోటి పారితోషికం అందుకున్న ఏకైక సౌత్‌స్టార్ మెగాస్టార్. అందుకే అత‌డికి ఉన్న గుర్తింపు వేరు. అత‌డి స్థాయి వేరు. ఖైదీనంబ‌ర్ 150 చిత్రంతో నాన్ బాహుబ‌లి రికార్డులు సృష్టించిన మెగాస్టార్ ప్ర‌స్తుతం `సైరా-న‌ర‌సింహారెడ్డి` చిత్రంతో మ‌రెన్నో రికార్డుల‌పైనా క‌న్నేశారు. ఈ సంద‌ర్భంలో ఓ అసాధార‌ణ ప‌రిణామం.

ఒకే ఒక్క మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా ప‌ది మంది హీరోలయ్యారు. వీళ్ల‌ను ద‌శావ‌తారాలు అని పిల‌వాల్సిందే ఇక‌! చిరంజీవి, నాగ‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, శిరీష్‌, వ‌రుణ్‌తేజ్, సాయిధ‌ర‌మ్ తేజ్, క‌ళ్యాణ్ దేవ్‌.. ఇంత‌మంది హీరోల‌కు ఇప్పుడు వైష్ణ‌వ్ తేజ్ రాక‌తో మొత్తం ప‌దిమంది హీరోల‌య్యారు ఆ కుటుంబంలో. ఇప్ప‌టికే నాగ‌బాబు న‌టుడిగా, టీవీ హోస్ట్‌గా రాణిస్తున్నారు. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్న త‌ర్వాత నంబ‌ర్ వ‌న్‌ స్థానాన్ని భ‌ర్తీ చేసిన మేటి క‌థానాయ‌కుడిగా నిరూపించారు. ఆ త‌ర్వాత ఆ స్థాయిని అందుకుంటున్న హీరోలుగా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఘ‌నుతికెక్కారు. ఆ ఇద్ద‌రూ న‌టించే సినిమాలు 100 కోట్ల షేర్ క్ల‌బ్‌ను అందుకుంటున్నాయి. మునుముందు మ‌రెన్నో సంచ‌ల‌నాల‌కు ఈ స్టార్లు తెర‌తీయ‌బోతున్నారు. స‌మ‌కాలీన హీరోల‌తో పోలిస్తే ఆ ఇద్ద‌రూ పోటాపోటీగా అగ్ర‌ప‌థాన ప‌య‌నిస్తూ నిరంత‌ర చ‌ర్చ‌ల్లో నిలుస్తున్నారు. మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌కి ఏ ఇత‌ర మెగా హీరోకి తీసిపోని ప్ర‌తిభావంతుడిగా గుర్తింపు ఉంది. కొన్ని ఫ్లాపులు ఇబ్బంది పెట్టినా అత‌డికి అవ‌కాశాల ప‌ర‌మైన స‌మ‌స్య లేదు. మునుముందు ఒకే ఒక్క బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో అత‌డు బౌన్స్ బ్యాక్‌ అవుతాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక‌పోతే వీళ్లంద‌రి కంటే మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ స్టైల్ డిఫ‌రెంట్. టాలీవుడ్‌లోనే ఏ ఇత‌ర హీరోతో పోల్చినా వ‌రుణ్ ఎంపిక‌లు డిఫ‌రెంట్. కెరీర్ ఆరంభం నుంచి ప్ర‌యోగాల హీరోగా రాణిస్తున్నాడు. ప్ర‌భాస్ త‌ర్వాత అంత హైటు, ఈజ్‌, గ్రేస్ ఉన్న హీరోగానూ వెలిగిపోతున్నాడు. బాస్ అల్లు అర‌వింద్ చిన్న కుమారుడు.. అల్లు శిరీష్ ప‌రిమిత బ‌డ్జెట్ సినిమాల‌తో హీరోగా త‌న‌ని తాను నిరూపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇంత‌మంది హీరోల‌కు లేటెస్ట్‌ ఎడిష‌న్ వైష్ణ‌వ్ తేజ్. మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడిగా అత‌డు ఇప్ప‌టికే సుప‌రిచితం. వైష్ణ‌వ్ హీరోగా ఆరంగేట్రం చేస్తున్నార‌ని చాలాకాలంగా వార్త‌లొస్తున్నాయి. తాజాగా మైత్రి మూవీస్- సుకుమార్ రైటింగ్స్ లాంటి క్రేజీ బ్యాన‌ర్ల సంయుక్త నిర్మాణంలో అత‌డు వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు, `రంగ‌స్థ‌లం` ర‌చ‌యిత బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీశ్రీ స‌హా టాప్ టెక్నీషియ‌న్ల‌తో ఈ చిత్రం తెరకెక్క‌నుంది. ఇక మెగా ఫ్యామిలీలోనే ఇంకెవ‌రైనా ఉన్నారా? అంటే మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె, న‌వ‌త‌రం క‌థానాయిక‌ నిహారిక కొస‌రు అనే చెప్పాలి. ఈ మెగా ప్రిన్సెస్ ఇప్ప‌టికే తెలుగు- త‌మిళ సినీరంగాల్లో పెద్ద స్టార్‌గా ఎదిగేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంది. ఓవైపు వెబ్ సిరీస్‌లు మ‌రోవైపు సినిమాల‌తో త‌న‌దైన స్టైల్లో కెరీర్‌ని ప్లాన్ చేసుకోవ‌డం నవ‌త‌రంలో చ‌ర్చ‌కొచ్చింది. ఒక‌టే మ‌హావృక్షం. ఎన్ని వేళ్లు అయినా పూనుతుంది. ఎన్ని కొమ్మ‌ల్ని అయినా విస్త‌రిస్తుంది. ఆ కొమ్మ‌ల నుంచి పుష్పాలు విక‌సించి కాయ‌లై .. పక్వానికొచ్చిన‌ పండుగా మారాక ఆ ఆనందం అనంతం అవుతుంది. ఇదంతా మెగా సామ్రాజ్యం. అన‌న్య సామాన్యమైన వంద‌ల- వేల కోట్ల సామ్రాజ్యంగా మునుముందు విస్త‌రించ‌బోతోంద‌న‌డానికి ఇదే సింబాలిక్.

User Comments